బాలీవుడ్ లెజెండరీ నటుడు- హీమ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు. ఆయన 89 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబీకులు ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు. ఈనెల ఆరంభం ధర్మేంద్ర తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని కథనాలొచ్చాయి. ఇంతలోనే ఆయన మృతి చెందినట్టు కూడా కొన్ని మీడియాలు కథనాలు ప్రచురించడం కలకలం రేపింది. కానీ అతడు ముంబై బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్సతో కోలుకుని తిరిగి జుహూలోని ఇంటికి వచ్చారు.
కానీ గురువారం నుంచి అనారోగ్యం మరింత తిరిగబెట్టింది. ఆయన ఊపిరితిత్తుల సంబంధ సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఈరోజు మృతి చెందారు. ముంబై పవర్ హన్స్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియల్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ధర్మేంద్ర కుటుంబీకులు శ్మశానవాటికకు చేరుకున్నారు. సన్నీడియోల్, ఇషాడియోల్, హేమమాలిని సహా వాటికలో అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ తదితరులు కనిపించారు.
1960లో `దిల్ భీ తేరా హమ్ భీ తేరే` చిత్రంతో నటనా జీవితాన్ని ప్రారంభించిన ధర్మేంద్ర దాదాపు 300 పైగా చిత్రాలలో నటించారు. చుప్కే చుప్కే, డ్రీమ్ గర్ల్, ధరమ్ వీర్, మేరా గావ్ మేరా దేశ్ వంటి చిత్రాలలో మరపురాని నటనతో పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఇక్కీస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో షోలే నటుడు అమితాబ్ మనవడు అగస్త్య నందా ఓ కీలక పాత్రధారి. బహుశా ఇది ధర్మేంద్ర కెరీర్ చిట్టచివరి సినిమా కానుంది.