మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారసుడైన జూనియర్ ట్రంప్ ని కలిసాడు. అతడితో మంతనాలు సాగించాడు. ఆపై గంట పాటు ఆ వేడుకలో ఆ ఇద్దరి గురించి అతిథులు ఆసక్తిగా మాట్లాడుకున్నారు. ఇంతకీ ఈ సమావేశానికి వేదిక ఎక్కడ? అంటే.. ఫార్మా దిగ్గజం - టెక్ దిగ్గజం పెళ్లిలో ఇది పాజిబుల్ అయింది. నేత్ర మంతెన- వంశీ గాదిరాజు పెళ్లి వేడుక గత మూడు రోజులుగా రాజస్థాన్ ఉదయ్ పూర్ కోటలో అంగరంగ వైభవంగా సాగుతోంది.
ఈ పెళ్లి వేడుకలో ఇప్పటికే జూనియర్ ట్రంప్ అతడి గాళ్ ఫ్రెండ్ తో సందడి చేసిన సంగతి తెలిసిందే. పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్ అద్భుత నృత్య ప్రదర్శనతో వేదికను హీటెక్కించింది. మరోవైపు బాలీవుడ్ నుంచి రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ తదితరులు వేడుకలో సందడిగా కనిపించారు.
ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ వంతు. అతడు బ్లాక్ సూట్ లో `పెద్ది` లుక్ తో బిలియనీర్ పెళ్లికి వెళ్లాడు. అక్కడ అతడిని ఇలా రగ్ డ్ లుక్ లో చూసి అహూతులు ఆశ్చర్యపోయారు. చరణ్ మ్యాన్‌లీ లుక్, మ్యానరిజమ్స్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారుతున్నాయి. ఈ వేదిక వద్ద ట్రంప్ సహా పలువురు పారిశ్రామిక, టెక్ దిగ్గజాలతో చరణ్ సరదా ముచ్చట్లకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.