భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచి జగజ్జేతగా నిలిచిన సంగతి తెలిసిందే. విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్న టీమిండియా సభ్యులు ప్రస్తుతం వైస్ కెప్టెన్ స్మృతి మందాన- సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ పెళ్లిలో సందడి చేస్తున్నారు. మూడు రోజులుగా సంగీత్, హల్దీ అంటూ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ పీక్స్ కి చేరుకున్నాయి. ఈ ఆదివారం సాయంత్రం వివాహ ముహూర్తం నిశ్చయించగా, కొన్ని గంటల్లోనే పెళ్లి కి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సమయంలో ఇది వాయిదా పడిందని స్మృతి మందన మేనేజర్ తుహిన్ మిశ్రా వెల్లడించారు.
దీనికి కారనం స్మృతి మందన తండ్రి గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరడమేనని తెలుస్తోంది. నేటి ఉదయం అల్పాహారం తీసుకునే సమయంలో స్మృతి తండ్రి శ్రీనివాస్ మందాన అనారోగ్యం కారణంగా ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురైన సమయంలో ఆంబులెన్స్ ని పిలిచి వెంటనే ఆస్పత్రిలో చేర్చించారు. ప్రస్తుతం ఆయనను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
అయితే తన తండ్రితో ఉన్న అద్భుతమైన బాండింగ్ దృష్ట్యా స్మృతి ఈ పెళ్లిని వాయిదా వేసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ``స్మృతి తన తండ్రిని చాలా ప్రేమిస్తుంది. ఆమె తండ్రి కోలుకునే వరకు వివాహం వాయిదా వేయాలని నిర్ణయించుకుంద``ని స్మృతి మేనేజర్ తుహిన్ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం పెళ్లి వేడుకకు అతిథులు వచ్చేసారు. సంబరాలు పీక్స్ కి చేరుకున్నాయి. గంటల్లోనే పెళ్లి.. కానీ ఇంతలోనే ఈ అశుభవార్త వినాల్సి వచ్చిందని అభిమానులు నిరాశలో ఉన్నారు.