హిందీలో రాజ్ అండ్ డీకే ద్వయం ఓటీటీ చరిత్రలోనే అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ కోసం చేసిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ ఓ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. ఆతర్వాత ఎన్నో వెబ్ సీరీస్ లు వచ్చినా ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ స్పెషల్ అనే చెప్పాలి. మనోజ్ బాజ్‌పాయ్ NIA ఏజెంట్ గా ఫ్యామిలీ మ్యాన్ గా పెరఫార్మెన్స్ తో ఆ పాత్రలో ఆయన్ని తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నంతగా ఆడియన్స్ ను మెప్పించగా, సుచి పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ భార్యగా ప్రియమణి అద్దరగొట్టేసింది. ఫ్యామిలీ మ్యాన్ కాన్సెప్ట్, మేకింగ్, రాజ్ అండ్ డీకే దర్శకత్వం అన్ని ఆ సీరీస్ ని అందనంత ఎత్తులో ఉంచాయి.
దానికి సీక్వెల్ గా వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సీజన్ 1 అంత కాకపోయినా అది కూడా మంచి రెస్పాన్స్ ని రాబట్టింది. ఆ సీజన్ లో సౌత్ గర్ల్ సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించింది. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 3 నవంబర్ 14 న అమెజాన్ ప్రైమ్ నుంచి ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.
ఫ్యామిలీ మ్యాన్ 3 మినీ స్టోరీ:
సీజన్ 3 కి వచ్చేసరికి చైనా విషయంలో భారత ప్రధాని చాలా సీరియస్ గా ఉంటారు. టాస్క్ ఏజెంట్ శ్రీకాంత్ తివారి తన సీనియర్ అధికారి కులకర్ణి తో కలిసి నాగాలాండ్ వెళ్తాడు. అక్కడ రెబల్స్ లీడర్ డేవిడ్ తో ప్రధాని అప్పగించిన ప్రాజెక్ట్ సహకార్ కోసం చర్చలు జరిపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అవి సఫలం కాకుండా ఉండాలని లండన్ లో ఉండే మీరా ఎస్టిన్ (నిమ్రత్ కౌర్) డ్రగ్స్ స్మగ్లర్ రుక్మా (జైదీప్ అహ్లావత్) కి సుపారీ ఇవ్వడమే కాదు కులకర్ణిని చంపేసి శ్రీకాంత్ తివారీని టాస్క్ కి ప్రైమ్ సస్పెక్ట్ చేస్తుంది.
ఆ తర్వాత శ్రీకాంత్ తివారి రుక్మ కోసం, రుక్మ శ్రీకాంత్ తివారి కోసం అన్నట్టుగా ఈమిషన్ మారిపోతుంది. మరోపక్క ప్రధాని పై నాగాలాండ్ లో బాంబ్ దాడి జరగడం అక్కడి నుంచి ప్రధాని తృటిలో తప్పించుకోవడం, టాస్క్ అధికారులు శ్రీకాంత్ తివారి ఆయన ఫ్యామిలీ కోసం వేట, అంతా టామ్ అండ్ జెర్రీ లా మారిపోతుంది. ప్రధాని టీమ్ లోనే ఆమె ఆలోచనలను నాశనం చెయ్యాలని ఎవరు చూస్తారు, అసలు మీరా ఎస్టిన్ ఎవరు, ఆమె వెనుక ఉన్నది ఎవరు, రుక్మ అనుకున్నది సాధించడం అనేది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 సింపుల్ స్టోరీ.
ఫ్యామిలీ మ్యాన్ 3 ఎఫర్ట్స్:
శ్రీకాంత్ తివారి పాత్రలో యాజ్ యూజ్వల్ గా మనోజ్ మనోజ్ బాజ్‌పాయ్ సూపర్బ్ అనిపించారు. అటు ఫ్యామిలీ మ్యాన్ గా ఇటు టాస్క్ ఆఫీసర్ గాను ఆకట్టుకున్నారు. ప్రియమణి సుచి పాత్రలో ఈసీజన్ లో ఎక్కువ సైలెంట్ గా కనిపించింది. మిగత ఆఫీసర్స్, అలాగే విలన్ గా చేసిన జైదీప్ ఆహ్లావత్ రుక్మ పాత్రకి పర్ఫెక్ట్ అనిపించారు. విజయ్ సేతుపతి చిన్న రోల్ కానీ ఆ రోల్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.
ఫ్యామిలీ మ్యాన్ 3 విశ్లేషణ:
సస్పెన్స్ థ్రిల్లర్స్ కి ఆయువు పట్టు ట్విస్ట్ లు. ఫస్ట్ సీజన్ లో ఉగ్రవాదులతో శ్రీకాంత్ తివారి టీమ్ ఫైట్ చేసినట్టు, సెకండ్ సీజన్ లో LTT తీవ్రాదులతో పోరాడిన విధంగా సీజన్ 3 లో యాక్షన్ సీక్వెన్స్ లు వుండవు. స్టోరీ కూడా లేదు. పవర్ ఫుల్ ఆఫీసర్ నే ప్రైమ్ సస్పెక్ట్ చెయ్యడం, అతని కోసం టాస్క్ వేట, మరోపక్క రుక్మ vs శ్రీకాంత్ తివారి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అన్నీ ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేవే. కాకపోతే ఈసీజన్ లో మనోజ్ బాజ్‌పాయ్ కి స్క్రీన్ స్పేస్ తక్కువ, ట్విస్ట్ లు ఉండవు, సన్నివేశాలు ముందే ఊహకు అందుతుంటాయి. అటు రుక్మ పాత్ర లో పవర్ ఫుల్ విలనిజం కనిపించలేదు. కామెడీ కోసం చాలా విషయాలను రాజ్ అండ్ డీకే పక్కనపెట్టేశారనిపిస్తుంది. బలమైన ఎమోషన్స్ కనిపించవు. కానీ సీరీస్ మాత్రం ఎక్కడా బోర్ కొట్టదు. ఐదో ఎపిసోడ్ కాస్త స్లో గా కనిపిస్తుంది తప్ప మిగతా ఎపిసోడ్ అన్ని అలా అలా సాగిపోతుంటాయి.
సీజన్ 1 తో కంపేర్ చేస్తే సీజన్ 3 లో ఎపిసోడ్స్ తక్కువ, BGM బావుంది, సినిమాటోగ్రఫీ అయితే రిచ్ గా వేరే లెవల్ అనే చెప్పాలి. రాజ్ అండ్ డీకే మరోసారి తమ ప్రతిభతో ప్రేక్షకులను ఈ సిరీస్ చూసేలా చేసారు అనడంలో సందేహం లేదు. కాకపోతే ఈ సీజన్ ని ఎండ్ చేసిన విధానం ప్రేక్షకులకు అంతగా రుచించదు. రాజ్ అండ్ డీకే సీజన్ 4 కోసం దీనిని సడన్ గా ఎండ్ చేసారు అనిపించకమానదు.