హైదరాబాద్ నగరంలో ప్రముఖ స్టూడియోస్ గా పేరున్న అన్నపూర్ణ స్టూడియోస్ , రామానాయుడు స్టూడియోస్ ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించలేదని, పన్ను ఎగవేస్తున్నారని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ట్రేడ్ లైసెన్స్ ఫీజు తగ్గించుకునేందుకు వాణిజ్య స్థలాన్ని (కమర్షియల్ స్పేస్) తక్కువ చేసి చూపిస్తున్నారని కూడా జీహెచ్ఎంసి తన నోట్ లో పేర్కొంది. అన్నపూర్ణ స్టూడియో 1.92 లక్షల చ.అల బిజినెస్ స్పేస్ ఉన్నా కానీ పన్ను తగ్గింపు కోసం 8100 చ.అల స్థలంలో మాత్రమే కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పేర్కొంటోంది. తద్వారా అన్నపూర్ణ స్టూడియోస్ 11,52,000 ఫీజును ట్రేడ్ లైసెన్స్ కోసం చెల్లించాల్సి ఉండగా 49వేలు మాత్రమే చెల్లిస్తోందని, 11లక్షలకు పైగా పన్నులు ఎగవేస్తోందని కథనాలొచ్చాయి. రామానాయుడు స్టూడియోస్ సైతం 68000 చ.అడుగుల స్థలంలో కమర్షియల్ గా పనులు చేస్తూ కేవలం 1900చ.అ.ల స్థలంలో మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. రామానాయుడు స్టూడియో రూ.2,73,000 చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.1,900 మాత్రమే చెల్లిస్తోంది. తద్వారా లైసెన్స్ ఫీజులో దాదాపు రూ.2.65 లక్షలు ఎగవేస్తోందని జీవిఎంసి నోటీసుల్లో పేర్కొన్నట్టు మీడియాలో కథనాలొచ్చాయి.
అయితే రామానాయుడు స్టూడియోస్‌పై వచ్చిన ఆరోపణలకు స్పందిస్తూ.. సురేష్ ప్రొడక్షన్స్ ఇవన్నీ తప్పుడు వార్తలు అని కొట్టివేసారు. అంతేకాదు తాము 68,000 చదరపు అడుగుల స్థలంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నామని, దానికి 2లక్షలు పైగా ట్రేడ్ లైసెన్స్ చెల్లించామని కూడా రామానాయుడు స్టూడియోస్ - సురేష్ ప్రొడక్షన్స్ వర్గాలు నోట్‌లో పేర్కొన్నాయి. అలాగే కమర్షియల్ స్పేస్ విషయంలో సోషల్ మీడియాల్లో తప్పుడు ప్రచారం సాగుతోందని కూడా ఖండించారు ఈ నోట్‌లో.
అయితే ట్రేడ్ లైసెన్స్ ఫీజును రూ. 7614 నుంచి ఏకంగా రూ. 2.73లక్షలకు అమాంతం పెంచేసారని , అధికారులు దీనిని పరిశీలించాలని కూడా రామానాయుడు స్టూడియోస్ అభ్యర్థించింది. తాము ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సులను రెగ్యులర్ గా సకాలంలో చెల్లిస్తున్నామని స్టూడియోస్ పేర్కొంది. తాము ప్రతిదీ జీహెచ్ ఎంసి అధికారులతో మంతనాలు సాగిస్తున్నామని కూడా వెల్లడించారు.