ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతోంది! ఎన్డీఏలో భాగం అయిన తెలుగు దేశం ప్రభుత్వం లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరిస్తూ ఏపీ అంతటా భారీ ప్రాజెక్టులను నిర్మించబోతోంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమ్మిట్ 2025 లో ఏకంగా 20లక్షల కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రకటించారు. విదేశాల నుంచే దాదాపు 600 పైగా ఇండస్ట్రియలిస్టులు, డెలిగేట్స్ వచ్చి భారీ ప్రాజెక్టులను ప్రకటించారు.
అయితే లక్షల కోట్ల పెట్టుబడులతో అన్ని రంగాలను అభివృద్ది చేస్తున్నా కానీ ఏపీలో వినోద పరిశ్రమ అభివృద్ధి గురించి కనీసమాత్రంగా అయినా ప్రస్థావన లేదు. అమరావతి, విశాఖపట్నంలో భూములు అందుబాటులో ఉన్నా కానీ భారీగా ఫిలింస్టూడియోలు నిర్మిస్తామని ఒక్క ఇండస్ట్రియలిస్టు కూడా ముందుకు రాలేదు. కనీసం కరణ్ జోహార్ ధర్మ సంస్థను 1000 కోట్లకు కొనుగోలు చేసిన సీరం గ్రూప్ అధినేత ఆధార్ పూనవల్లా కూడా ఏపీలో స్టూడియో కట్టేందుకు ఆసక్తిని కనబరచలేదు. సల్మాన్ ఖాన్ అమరావతి లేదా హైదరాబాద్ లో స్టూడియోని నిర్మిస్తాడని ఆశిస్తున్నా అది ఇంకా ఖరారు కాలేదు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గ్రిప్ లోనే సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఉంది. కానీ ఏపీలో సినిమా అభివృద్ధికి జరగాల్సినది ఏమీ జరగడం లేదని ఇటీవల ఆరోపణలు వస్తున్నాయి. ఇతర రంగాలతో పోలిస్తే వినోద రంగం చాలా చిన్నబోయింది. సినిమా- టీవీ రంగం స్థానికంగా అభివృద్ధి చేయడానికి ఆసక్తి ఉన్నట్టు కనిపించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇక ఏపీ- విజయవాడలో ఫిలింఛాంబర్ ఉందని, ఎఫ్.డి.సి ఉందని పేపర్లలో చదవడం తప్ప వీళ్ల కార్యకలాపాల గురించి ఎవరికీ ఏమీ తెలీదు. అవి ఉన్నా లేనట్టేననే వాదన కూడా ఉంది.
వీలున్న ప్రతి వేదికపైనా విశాఖపట్నం ఏపీలో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి .. షూటింగులు చేయండని రాజకీయ నాయకులు చెబుతున్నా.. స్థానికంగా షూటింగులకు అసవరమైన మౌళిక వసతులను కల్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ కి తాయిలాలు అందిస్తుంటే, ఏపీలో ప్రభుత్వ అలసత్వంతో టాలీవుడ్ గుండు సున్నాగా మారింది.