ప్రతి రోజూ ఏదో ఒక కొత్త వార్త.. మంచి వార్త వినాలని ఆంధ్రా ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. ఇటీవల సీఐఐ సమ్మిట్-2025లో లక్షల కోట్ల ఒప్పందాలతో ఏపీలో కొత్త పునరుజ్జీవం కనిపించింది. ఈ ప్రాజెక్టులన్నీ ఒప్పందం ప్రకారం సకాలంలో పూర్తయితే, ఆంధ్రప్రదేశ్ మరో సింగపూర్, హాంకాంగ్ లా మారుతుంది. కానీ ఏపీ రాజకీయాలు ప్రజల భవిష్యత్ ని నిర్ధేశించనున్నాయి.
దేశ, విదేశాల నుంచి తరలి వచ్చిన ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్‌మేన్‌లు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఇలాంటి సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ స్టోరీలో భాగం అయ్యేందుకు ఆస్కారం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అతడు అమరావతి లేదా విశాఖపట్నంలో భారీ ఫిలింస్టూడియో నిర్మించేందుకు సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించే వీలుందని టాక్ వినిపిస్తోంది.
అయితే అంతకంటే ముందే అతడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాద్ లో భారీ ఫిలింస్టూడియో ఏర్పాటు గురించి చర్చించారని తెలిసింది. డిసెంబర్ లో జరగనున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్- 2025 కార్యక్రమంలో ఎంవోయు కుదుర్చుకునే అవకాశం ఉందని తెలిసింది. ఫిలింస్టూడియో నిర్మాణం కోసం ప్రభుత్వం భారీ రాయితీలతో భూములను ఇవ్వాల్సి ఉంటుంది. సల్మాన్ ఖాన్ కోసం కందుకూరు మండలం, మీర్ ఖాన్ పేట్ భారత్ ఫ్యూచర్ సిటీలో 50 ఎకరాలు కేటాయించే వీలుందని ప్రచారం సాగుతోంది. అయితే అతడు ఒప్పందాలలో వేగంగా స్పందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటాడా? వినోద పరిశ్రమకు అత్యంత సానుకూలంగా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటారా? అన్నది వేచి చూడాలి.