`చిరుత` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది నేహాశర్మ. ఈ చిత్రంతోనే మెగాస్టార్ నటవారసుడు రామ్ చరణ్ కూడా వెండితెరకు పరిచయమయ్యాడు. కానీ చిరుత తర్వాత నేహా శర్మ ఏమైందో ఎవరికీ తెలీదు. నేహా శర్మ తో ప్రేమలో పడిన ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన హీరోల మధ్య గొడవలు జరిగాయని కూడా అప్పట్లో ప్రచారమైంది. అదంతా అటుంచితే, నేహా శర్మ కెరీర్ ఇటీవలి కాలంలో ఆశించినంతగా సాగడం లేదు. ఈ బ్యూటీ బాలీవుడ్ లో పెద్ద స్టార్ అవ్వాలని కలలు కంది. అలాగే తన సోదరి ఐషా శర్మను కూడా నటిగా పరిచయం చేసింది. కానీ సిస్టర్స్ పప్పులేవీ ఉడకడం లేదు.
మరోవైపు తన తండ్రి బిహార్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పాపులర్. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన బాగానే ఆర్జించాడు. కానీ కూతుళ్లకు మాత్రం ఆశించిన గ్లామర్ రంగంలో మంచి కెరీర్ దక్కలేదు. ఇటీవల బీహార్ ఎన్నికల్లో నేహా శర్మ తండ్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అజీత్ శర్మ భాగల్పూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి చెందిన రోహిత్ పాండే చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ప్రచారంలో చిరుత బ్యూటీ నేహా శర్మ తన తండ్రి తరపున పబ్లిక్ లోకి వెళ్లి ప్రచారం చేసినా అది కలిసి రాలేదు. పాండే 28 రౌండ్ల కౌంటింగ్ తర్వాత 13,474 ఆధిక్యంతో శర్మను ఓడించి సీటును గెలుచుకున్నారు. 16 రౌండ్ల కౌంటింగ్ తర్వాత పాండే వెనుకబడి ఉండగా శర్మ ఆధిక్యంలో కనిపించినా చివరికి గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు.
అజీత్ శర్మ తన రాజకీయ కెరీర్ లో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు తన కూతుళ్లు నేహా శర్మ, ఐషా శర్మల ఆకర్షణీయమైన ప్రచారం ఉన్నా, నువ్వా నేనా? అంటూ సాగిన పోటీలో ఓటమిని ఎదుర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు-2025లో మహాఘట్బంధన్‌ను ఓడించి ఎన్డీఏ మెజారిటీ మార్కును దాటింది.
ఎన్డీయేలో భాజపా, జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా కలిసి ఉన్నాయి.
మహాఘట్బంధన్ కు రాష్ట్రీయ జనతాదళ్ నాయకత్వం వహిస్తుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ, దీపాంకర్ భట్టాచార్య నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) (CPI-ML), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPM), ముఖేష్ సహానీ వికాశీల్ ఇన్సాన్ పార్టీ (VIP) ఉన్నాయి.