ఎనర్జిటిక్ స్టార్ రామ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. `దేవదాస్` తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చినా చిత్ర పరిశ్రమలో తనని తానే నిర్మించుకుని నటుడిగా ఎదిగాడు. రామ్ లో ఎనర్జీని చూసి వై. వి. ఎస్ చౌదరి తన హీరోగా తీసుకోవడంతోనే చిత్ర పరిశ్రమలో అంత గొప్ప జర్నీ సాధ్యమైంది. తొలుత రామ్ హీరోగా తెలుగు కంటే తమిళ్ లోనే ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. కానీ చౌదరి పట్టు బట్టడంతో టాలీవుడ్ లో లాంచ్ అవ్వక తప్పలేదు.
ప్రస్తుతం రామ్ జర్నీ దేదీప్య మానంగా సాగిపోతుంది. నవతరం దర్శకులకు అవకాశాలను కల్పిస్తూ నటుడిగా రాణిస్తున్నాడు. కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నాడు. లగ్జరీ కార్లు వాడుతున్నాడు. ఖరీదైన జీవితం చూస్తున్నాడు. ఇదంతా ఇప్పుడు మరి రామ్ గతంలోకి వెళ్తే? ఆయన జీవితంలో చాలా వ్యధలే ఉన్నాయని తెలుస్తోంది. ఆ విషయాలు రామ్ మాటల్లోనే..
`నా చిన్నప్పుడు మేము బాగా ఉన్న వాళ్లమే. కానీ విజయవాడలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు కారణంగా రాత్రికి రాత్రే సర్వం కోల్పోయాం. దాంతో అప్పటికప్పుడు చెన్నైకి వెళ్లిపోయాం. విజయవాడలో ఉన్నప్పుడు నాకు బొమ్మల కోసమే ప్రత్యేకంగా ఓ గది ఉండేది. కానీ చెన్నైలో చిన్న గదిలోనే కుటుబమంతా ఉండేవాళ్లం.ఆ స్థితికి వెళ్లడంతో నాన్న మళ్లీ మొదటి నుంచి జర్నీ మొదలు పెట్టారు.
అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ అనేక కష్టాలు పడ్డారు. చివరికి అన్నీ సంపాదించి గత వైభవాన్ని చూపించారు. అందుకే నాన్న అంటే మాకు అందరికీ ఎంతో ప్రేమ గౌరవం` అన్నారు. ప్రస్తుతం రామ్ హీరోగా మహేష్ దర్శకత్వంలో `ఆంధ్రా కింగ్ తాలూకా` అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం తాలూకా నుంచి `ఆంధ్రా కింగ్ తాలూకా` పుట్టడంతో టైటిల్ క్రేజీగా మారింది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని రామ్ సైతం కసిగా ఉన్నాడు.