సునీల్ శెట్టి నటవారసుడు అహన్ శెట్టి ప్రముఖ మరాఠీ నటి జియా శంకర్ తో డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఒకానొక సమయంలో ఈ జంట పెళ్లి బాజాలు మోగుతాయని కూడా గుసగుసలు వినిపించాయి. అయితే అహన్ శెట్టి బృందం ఇప్పుడు అన్ని డేటింగ్ ఊహాగానాలను కొట్టి పారేసింది.
టైమ్స్ కథనం ప్రకారం.. అహాన్ బృందం ఒక నోట్ విడుదల చేసింది. దాని సారంశం ఇలా ఉంది. ``ఈ డేటింగ్ పుకార్లు పూర్తిగా నిరాధారమైనవి. అహన్ ప్రస్తుతం ఎవరినీ కలవడం లేదు. అతడు పూర్తిగా తన పనిపై దృష్టి పెట్టాడు. అహాన్ వరుసగా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. బోర్డర్ 2 త్వరలో వస్తుంది`` అని రాసారు.
2021లో సాజిద్ నదియాద్వాలా తెరకెక్కించిన `తడప్`తో అహన్ శెట్టి బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. కానీ మొదటి చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇప్పుడు అతడు సన్నీడియోల్ లాంటి సీనియర్ హీరోతో `బోర్డర్ 2`లో నటిస్తున్నాడు.
అహాన్ ప్రియురాలు అంటూ ప్రచారం సాగుతున్న జియా శంకర్ మరాఠా నటి. చివరిసారిగా జెనీలియా -రితేష్ దేశ్‌ముఖ్‌లతో కలిసి మరాఠీ చిత్రం -వేద్‌లో కనిపించింది. పాపులర్ టీవీ షోలు పిషాచిని, కాటేలాల్ & సన్స్ లోను కనిపించింది. మరాఠా బిగ్ బాస్ OTT 2లో కూడా ఇంటి సభ్యురాలిగా కొనసాగింది. మొత్తానికి అహాన్ బృందం డేటింగ్ పుకార్లకు పూర్తిగా చెక్ పెట్టినట్టే. అయితే పుకార్లను ఎదుర్కొంటున్న తారలు ఎవరూ దీనిని అధికారికంగా ధృవీకరించలేదు.