యువతరం హృదయాల్లో ఐకాన్ స్టార్ గా బలమైన ముద్ర వేసిన అల్లు అర్జున్ తన రేంజును అంతకంతకు పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. అతడు పుష్ప 2 తర్వాత తన తదుపరి చిత్రం కోసం అట్లీ రూపొందించిన సైన్స్ ఫిక్షన్ స్క్రిప్టును ఎంపిక చేయడం వ్యూహాత్మకం. పాన్ వరల్డ్‌లో అందరి దృష్టిని ఆకర్షించడానికి అతడు ఈ ప్రయోగాత్మక స్క్రిప్టును ఎంపిక చేసుకున్నాడు. అయితే రెగ్యులర్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్లను అందించిన అట్లీ ఈ సవాల్ ని ఎలా నిరూపించబోతున్నాడో తెలుసుకోవడానికి ఇంకా కొన్ని నెలలు వేచి చూడాల్సి ఉంటుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ సైన్స్ ఫిక్షన్ మూవీ చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఈ సినిమాలో తన పార్ట్ ని ఏప్రిల్ లేదా మే నాటికి పూర్తి చేయాలని బన్ని కంకణం కట్టుకున్నాడు. త్వరత్వరగా షెడ్యూళ్లను ముగించి తన తదుపరి చిత్రంపై దృష్టి సారిస్తాడని కూడా తెలుస్తోంది. అయితే బన్నీ కోసం దర్శకుల క్యూ కూడా పెద్దదే ఉంది. ఇందులో రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్లతో పాటు కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, కొరటాల శివ కూడా బన్నీ కోసం బౌండ్ స్క్రిప్టులు రెడీ చేస్తున్న వారి జాబితాలో ఉన్నారు. అట్లీతో సినిమాని పూర్తి చేసిన వెంటనే బన్నీ తన కోసం ఎదురు చూస్తున్న బౌండ్ స్క్రిప్టుల్ని వినడం మొదలు పెడతారట. ఇప్పటికే పలుమార్లు భన్సాలీ లాంటి దర్శకుడితో అతడు చర్చలు సాగించినట్టు తెలిసింది. ఇక కొరటాల ఇంతకుముందు మిస్సయినా బన్నీతో ప్రాజెక్ట్ చేయాలని పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ కూడా బన్నీ కోసం ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ తో అల్లు అర్జున్ ప్రాజెక్టుని సెట్ చేయాలని దిల్ రాజు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇక మహేష్ తో సినిమాని ముగించాక రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ లేదా ఎన్టీఆర్ తో చేసేందుకు ఆస్కారం ఉందని కూడా కథనాలొస్తున్నాయి. అయితే హీరోల ఇమేజ్ కి సరిపడే మంచి బౌండ్ స్క్రిప్టు ఎవరు ముందుగా రెడీ చేసారు? అనేది ప్రతిదీ డిసైడ్ చేస్తుంది.