స్టార్ హీరోల అదుపు తప్పిన పారితోషికాలు నిర్మాతకు బొప్పి కట్టిస్తున్న సంగతి తెలిసిందే. పెట్టుబడులు తిరిగి రాక, ఓటీటీ- శాటిలైట్ ఆదాయం దిగాలైపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో నిర్మాతలు ఉన్నారు. థియేట్రికల్ గాను 5శాతం మించి సక్సెస్ రేటు లేకపోవడంతో తమిళ నిర్మాతల మండలి (టిఎఫ్‌పిసి) ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో కొన్ని కీలక విషయాలపై తంబీలు చర్చించారు.
ఈ చర్చల ప్రకారం.. ఇకపై రజనీకాంత్, విజయ్ లాంటి స్టార్లు వందల కోట్లు పారితోషికంగా అందుకోవడం సాధ్యపడదు. ఫలానా స్టార్ హీరో 200 కోట్లు అందుకుంటున్నారంటూ సాగే ప్రచారానికి చెక్ పెట్టేందుకు నిర్మాతల మండలి సరైన నిర్ణయాలను తీసుకుంది. ఇకపై నిర్మాతలతో కలిసి లాభనష్టాల్లో హీరోలు కూడా వాటాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, 100కోట్లు లాభం వస్తే, హీరో- నిర్మాత- సాంకేతిక నిపుణులు సంయుక్తంగా పంచుకునేలా కొత్త రూల్ ని అమల్లోకి తెచ్చారు. లేదా 100 కోట్లు నష్టం వచ్చినా హీరోలు- సాంకేతిక నిపుణులు కూడా వాటా తీసుకోవాల్సి ఉంటుంది. మారిన రూల్స్ ప్రకారం ఇకపై అందరూ దీనిని అనుసరించాలి.
అంతేకాదు థియేటర్ల మనుగడను నిలబెట్టాలంటే ఇకపై వెబ్ సినిమాలు, యూట్యూబ్ - ఓటీటీ సినిమాలు తీయడం తగ్గించాలి. వాటిని ఎంకరేజ్ చేయకూడదు. థియేటర్లలో రిలీజ్ చేసే కంటెంట్ ని మాత్రమే తెరకెక్కించాలి. అలా చేయని వ్యక్తులపై అనధికారిక నిషేధం అమల్లో ఉంటుంది. వారికి పంపిణీదారులు, సినీవర్గాలు సహకరించవు.
తాజా నిర్ణయంతో రజనీకాంత్, కమల్ హాసన్, దళపతి విజయ్, అజిత్, సూర్య వంటి అగ్ర హీరోల ఆదాయం తీవ్రంగా ప్రభావితం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఒక రకంగా నిర్మాత అదృష్టాన్ని, దురదృష్టాన్ని కూడా హీరోలు, సాంకేతిక నిపుణులకు సమానంగా పంచేస్తున్నారన్నమాట.
ఓటీటీ రిలీజ్ గడువు విషయానికి వస్తే, పెద్ద బడ్జెట్ సినిమాలకు 8వారాలు, మధ్యస్త సినిమాలకు 6వారాలు, చిన్న బడ్జెట్ సినిమాలకు 4 వారాలు గడువు ఉంటుంది. థియేటర్ యజమానులు, పంపిణీదారుల సహకారంతో సినిమాల రిలీజ్ సమస్యలు తలెత్తకుండా, నిర్మాతల మధ్య విభేధాలను ఆపేందుకు కమిటీ పని చేస్తుందని టి.ఎఫ్.పి.సి ప్రకటించింది.