ఇటీవల చాలామంది సెలబ్రిటీలు తమ వ్యసనాలను బహిరంగంగా వెల్లడిస్తున్నారు. తప్పు చేసామని అంగీకరిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తాను 14 వయసులోనే ఆల్కహాల్ కి బానిసయ్యానని, స్నేహితులతో కలిసి ప్రారంభించిన ఈ అలవాటు తనను బానిసగా మార్చిందని అంగీకరించారు. తాను మానేయాలని ఎంత ప్రయత్నించినా మానడం సులువు కాదని అర్థమైనట్టు తెలిపాడు. స్నేహితులు పెగ్గు అలవాటు చేసినప్పుడు ఈ ఒక్కసారికే అనుకున్నాడట. కానీ అది కుదరలేదు. నెమ్మదిగా అలవాటుగా మారిందని దేవగన్ చెప్పారు.
వ్యసనం మానడం కోసం ఒక స్పా సెంటర్ లో చేరి థెరపీ చేయించుకున్నానని, ఆ తర్వాత నెమ్మదిగా మత్తు నుంచి బయటపడ్డానని తెలిపాడు దేవగన్. ఇప్పుడు 30 ఎంఎల్ మాల్ట్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇది చాలా ఖరీదైనది. రెండు పెగ్గులు మించకుండా దినచర్యగా మాత్రమే తీసుకుంటున్నానని అజయ్ దేవగన్ చెప్పాడు. ఇప్పుడు తాను మద్యానికి బానిసను కాదని వెల్లడించాడు. కొందరు తాగిన తర్వాత ఇష్టం వచ్చినట్టు వాగుతారు.. తాగాక అదుపులో లేకపోతే నాకు నచ్చదని దేవగన్ అన్నారు.
అజయ్ దేవగన్ బాలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ప్రముఖ కథానాయిక కాజోల్ ని పెళ్లాడిన విషయం తెలిసిందే. అతడు తన మేనల్లుడు అమన్ దేవగన్ ని కథానాయకుడిగా పరిచయం చేసాడు. త్వరలోనే కుమార్తె నైసా దేవగన్ ని నటిగా పరిచయం చేయనున్నాడని గుసగుస వినిపిస్తోంది. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో టాలీవుడ్ లోను అడుగుపెట్టాడు. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో కెరీర్ పరంగా బిజీగా ఉన్నాడు. దేదే ప్యార్ దే 2, ధమాల్ 4 వంటి సీక్వెల్ చిత్రాలతో సెట్లలో బిజీగా ఉన్నాడు.