ఇటీవల సినిమాల ప్రొడక్షన్ కాస్ట్ అదుపు తప్పుతోంది. అదుపు తప్పిన ఖర్చులు కాస్ట్ ఫెయిల్యూర్ కి దారి తీస్తున్నాయి. హీరోలు, స్టార్ డైరెక్టర్ల పారితోషికాలు నిర్మాతలకు అదనపు భారంగా మారాయి. అయితే చాలా నిర్మాణ సంస్థలు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు అడిగినంతా చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉన్నా కానీ, దిగువ స్థాయిలో కార్మికులకు సరిపడా భత్యం ఇవ్వడానికి ముందుకు రావడం లేదని టాలీవుడ్ ని నిరవధిక బంద్ తో స్థంభింపజేసిన ఫెడరేషన్ ఇంతకుముందు వెల్లడించింది.
దర్శకరత్న డా.దాసరి నారాయణరావు వంటి ప్రముఖుడు పరిశ్రమలో హీరోల పారితోషికాలు అదుపుతప్పాయని, వారు దిగి రావాలని కూడా చాలా పోరాటం సాగించారు. అయితే ఆయన ఆశించిన మార్పు ఎప్పటికీ సాధ్యం కానిది. తమకు ఉన్న డిమాండ్ ని బట్టి పారితోషికం లభిస్తుందని హీరోలు ప్రతిసారీ వాదిస్తున్నారు.
అదంతా సరే కానీ, ఇప్పటికీ సినీకార్మికులకు సరిపడా భత్యం అందడం లేదా? అంటే.. ఒక ఇన్సిడెంట్ గురించి ప్రముఖ సెట్ డిజైనర్ కం ఇన్ఫ్యూయెన్సర్ చెప్పిన విషయం వాస్తవానికి అద్దంపట్టింది. తాను కొన్నేళ్ల క్రితం విడుదలైన `కల్ హో న హో` చిత్రానికి సెట్ డిజైనర్ గా పని చేసానని, అమెరికాలో ఒక రెస్టారెంట్ డైన్ ఏరియాను రిపెయిర్లు చేసి ఇచ్చే ఉద్యోగం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అప్పజెప్పిన పని కోసం తాను రోజులో 18 గంటలు శ్రమించినా కానీ కేవలం 75 డాలర్లు మాత్రమే చెల్లించేవారు.. ఇది పనికి తగ్గ వేతనం కాదని సదరు మహిళా డిజైనర్ ఆవేదన చెందారు.
యష్ రాజ్ ఫిలింస్, ధర్మ ప్రొడక్షన్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలే ఇలా చేయడంపై ఆవేదన చెందినట్టు సదరు సెట్ డిజైనర్ తన అనుభవాన్ని వివరించారు. ఇది కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు.. అన్ని సినీపరిశ్రమల్లోను ఉన్నదే. దిగువ స్థాయి ఉద్యోగుల జీత భత్యాలు పెంచేందుకు నిర్మాణ సంస్థలు సముఖంగా లేవు. హీరోలు దర్శకులకు తగ్గించలేరు. అందువల్ల ఆ భారాన్ని కార్మిక వర్గాలు జీవితాంతం మోయాల్సిందే.