ఆంధ్రలో ఈమధ్య కాలంలో కల్తీ మద్యం కేసు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. జనార్దన్ రావు అనే వ్యక్తి ఈ కల్తీ మద్యం కేసులో కీలక నిందితుడిగా పోలీసులకు పట్టుబడడమే కాకుండా.. తన వెనుకున్నది వైసీపీ నేత జోగి రమేష్ అంటూ తన స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈకేసు లో జోగి రమేష్ కూడా ముద్దాయిగా మారారు.
జోగి రమేష్ కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి అభాసు పాలు చేసేందుకు తనను పావుగా వాడుకుని కల్తీ మద్యాన్ని తయారు చేయించాడు అంటూ జనార్దన్ రావు వాంగ్మూలం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. అప్పటినుంచి జోగి రమేష్ ను ఈ కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాల నడుమ ఈ రోజు ఉదయమే జోగి రమేష్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేసారు.
నోటీసు లు ఇచ్చి జోగి రమేష్ ను అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు వెళ్లగా.. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసం వద్ద హైడ్రామా నడుమ జోగి రమేష్ ను ఆయన పీఏ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విజయవాడ సిట్ ఆఫీసుకు తరలించారు.