టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా కెరీర్ ప్రారంభించిన రామ్ చరణ్, తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగి నేడు పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న సంగతి తెలిసిందే. అతడి స్టార్ డమ్ ఇప్పుడు అసాధారణమైనది. పాన్ ఇండియాలోనే కాదు.. పాన్ వరల్డ్ లోను ఇప్పుడు అతడికి అద్భుత గుర్తింపు ఉంది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్, గోల్డెన్ గ్లోబ్స్, హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాల వేదికపై చరణ్ ని వీక్షించిన చాలా మంది దిగ్గజ హాలీవుడ్ స్టార్లు అతడికి ప్రపంచ సినీవిఫణిలో మంచి భవిష్యత్ ఉన్న స్టార్ అని కొనియాడారు.
ఆ స్థాయికి ఒక నటవారసుడు ఎదగడం అంటే ఆషామాషీ కాదు. చాలా విమర్శలు.. చాలా సందిగ్ధతలు.. అంచనాల నడుమ అన్నిటినీ అధిగమించి నేడు రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సఫలమయ్యాడు. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇకపై స్టార్ డమ్ ని పాన్ వరల్డ్ కి విస్తరిస్తూ దూసుకెళుతున్నాడు.
అయితే బాలీవుడ్ లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటవారసుడు అభిషేక్ బచ్చన్ విషయంలో ఇది జరగలేదు. బిగ్ బి లెగసీని విజయవంతంగా ముందుకు నడిపించాల్సిన అభిషేక్ అందుకు భిన్నమైన సమస్యల్ని ఎదుర్కొన్నాడు. అతడు తన తండ్రి వారసత్వాన్ని ముందుకు నడిపించడంలో విఫలమయ్యాడు. బాలీవుడ్ ని ముందుండి నడిపించేంత ధీటైన హీరో కాలేకపోయాడు. ఖాన్ ల త్రయం స్టార్ డమ్ ముందు, రోషన్ లు, కపూర్ హీరోల ముందు అతడు తలవొంచాడు. ఇది నిజంగా అమితాబ్ జీ ఊహించనిది. కానీ అభిషేక్ బచ్చన్ చాలా కాలం పోరాటం తర్వాత విమర్శకుల ప్రశంసలు పొందే నటుడిగా ఎదగడం కొంత మేలి మలుపు. అతడు నటించిన సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయకపోయినా నటడిగా నిరూపించాడనే పేరు మాత్రమే తేగలడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబ గౌరవాన్ని నిలబెడుతూ లెగసీని ముందుకు నడిపించే మరో వారసుడి గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది. అతడు మరెవరో కాదు.. అమితాబ్ కుమార్తె శ్వేతానందా బచ్చన్ కుమారుడు అగస్త్య నందా. అతడు ఇప్పటికే జోయా అక్తర్ ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తో నటుడిగా ఆరంగేట్రం చేసాడు. సుహానా ఖాన్, ఖుషి కపూర్ లాంటి నటవారసులతో కలిసి అతడి ఆరంగేట్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అగస్త్య బాలీవుడ్ లో ఛరిష్మాటిక్ హీరో అనడంలో సందేహం లేదు. అతడి నటన హావభావాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. కచ్ఛితంగా అతడు తన తాత లెగసీని ముందుకు నడిపించగలడనే భరోసా కనిపిస్తోంది. అయితే అతడు స్టార్ డమ్ ని అందుకునేందుకు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో అతడు వార్ డ్రామా `ఇక్కిస్`తో ప్రేక్షకాభిమానుల ముందుకు దూసుకొస్తున్నాడు. తాజాగా ఇక్కిస్ ట్రైలర్ విడుదలైంది. వార్ డ్రామాలో అగస్త్య నటన, ఆహార్యం అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఇక్కిస్ కథాంశం కూడా ఆసక్తికరం. ఇది బయోపిక్ కేటగిరీ చిత్రం. భారతదేశంలో పరమవీరచక్ర అవార్డును పొందిన అతి పిన్న వయస్కుడైన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద ప్రధాన పాత్రలో నటించగా, ఇందులో ధర్మేంద్ర కూడా కీలక పాత్రలో నటించారు. ట్రైలర్‌లో అగస్త్య నంద యుద్ధ వీరుడిగా కనిపిస్తున్నాడు. నెక్ట్స్ పరమవీర చక్రాన్ని తన రెజిమెంట్ గెలుచుకుంటుందని ధైర్యంగా ప్రకటించే యువ సైనిక బెటాలియన్ నాయకుడిగా అగస్త్య కనిపించారు. భారత్ -పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రకటించినప్పుడు దేశం పట్ల తన ప్రేమను చూపించే ధైర్యవంతుడిగాను కనిపించాడు. యుద్ధ వీరుడిగా తన ట్యాంక్‌లో చివరి శ్వాస వరకు పోరాడుతున్నట్లు కనిపించడం ఎమోషన్ ని రగిలిస్తోంది. వార్ డ్రామా ఆద్యంతం అగస్త్య నందా నటన, పరాక్రమం కనిపిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ రూపొందించిన ఈ చిత్రాన్ని మాడాక్ ఫిల్మ్స్ నిర్మించింది.
ఈ ట్రైలర్ చూసాక కొందరు అభిఏక్ బచ్చన్ గుర్తుకు వచ్చాడని వ్యాఖ్యానించినా కానీ, అభిషేక్ కంటే భిన్నంగా అతడు అమితాబ్ బచ్చన్ లెగసీని ముందుకు నడిపిస్తాడని అభిమానులు నమ్ముతున్నారు. బహుశా అగస్త్య ఎంపికలు అతడిని ముందుకు నడిపిస్తాయని భావించాలి.