షాజహాన్ గుడిని పడగొట్టి ప్రేయసి కోసం తాజ్ మహల్ అనే సమాధిని నిర్మించాడా? పవిత్ర భారతదేశంలోని హిందూ దేవాలయాలను నాశనం చేసిన ముస్లిమ్ చక్రవర్తుల దాష్ఠీకంపై `ది తాజ్ స్టోరి` సినిమాని తెరకెక్కించారా? అంటే.. అవుననే మీడియాలో కథనాలొస్తున్నాయి.
పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం `ది తాజ్ స్టోరీ` మతపరమైన రంగును పులుముకోవడంతో, అక్టోబర్ 31న విడుదలకు ముందే చట్టపరమైన ఇబ్బందుల్లో పడింది. అయోధ్యకు చెందిన బిజెపి ప్రతినిధి రజనీష్ సింగ్ ఈ చిత్రాన్ని నిషేధించాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. మే 2022లో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో తాను దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా `ది తాజ్ స్టోరీ` చిత్రాన్ని రూపొందించారని ఆయన పేర్కొన్నారు. తాజ్ మహల్ లోపల ఉన్న 22 తాళాలు వేసిన గదులను తెరవాలని రజనీష్ తన పిటిషన్‌లో కోరారు.
ఆ స్మారక చిహ్నం మొదట దేవాలయం అని అన్నారు. 17వ శతాబ్దపు నిర్మాణాన్ని అధ్యయనం చేసి స్పష్టమైన సమాధానం ఇవ్వాలని భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) సభ్యులతో కూడిన కమిటీని కూడా ఆయన అభ్యర్థించారు. అయితే హైకోర్టు 2022 మేలో అతడి పిటిషన్‌ను కొట్టివేసింది.
సమాచార- ప్రసారాల మంత్రిత్వ శాఖ - సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కి కూడా సింగ్ ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదు ప్రకారం.. తాజ్ మహల్‌లోని 22 మూసివేసిన గదులను తెరవాలని నేను ఒక పిల్ దాఖలు చేసాను. చారిత్రక వాస్తవాల పారదర్శకత, ధృవీకరణను నిర్ధారించడమే నా లక్ష్యం. ది తాజ్ స్టోరీ సినిమా నా పిటిషన్‌లోని విషయంపై ఆధారపడి తెరకెక్కించారని నాకు తెలిసింది. సినిమా పోస్టర్లు, ప్రచార సామగ్రి , కథాంశం తన అనుమతి పొందకుండానే సినిమా తీసారని, తన పిటిషన్‌ను తప్పుదారి పట్టించే రీతిలో సినిమా తీసారని కూడా అతడు పేర్కొన్నాడు. నాకు చెందిన మేధోపరమైన చట్టపరమైన హక్కుల ఉల్లంఘన జరిగిందని నివేదించారు. అందుకే ఈ సినిమాను నిషేధించాలని కూడా ఆయన కోరారు. తన పిటిషన్‌లోని అంశాలతో ఈ సినిమా కథాంశం ముడి పడి ఉందా లేదా? అన్నది పరిశీలించాలని కూడా సింగ్ కోర్టును కోరారు. విచారణ పూర్తయ్యే వరకు, సినిమా ప్రమోషన్ , ప్రదర్శనను నిషేధించాలని కూడా బిజెపి నాయకుడు సింగ్ అన్నారు.
ది తాజ్ స్టోరీకి తుషార్ అమ్రిష్ గోయెల్ దర్శకత్వం వహించారు. ఆయనే రచయిత. సురేష్ ఝా నిర్మించారు. ఇందులో పరేష్ రావల్, జాకీర్ హుస్సేన్, అమృత ఖన్విల్కర్, నమిత్ దాస్, స్నేహ వాఘ్ కీలక పాత్రలు పోషించారు.