సినీకార్మికుల భత్యాల సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా సినీకార్మిక సమాఖ్య (ఫెడరేషన్) ఈ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో సీఎంను ఘనంగా సన్మానించిన సంగతి తెలిసిందే. ఈ సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్ సినీకార్మికులకు ఊహించని వరాలు ప్రకటించారు.
టాలీవుడ్ కార్మికులకు ఉచిత ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా వారి పిల్లలకు ఉచిత విద్య వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రామిస్ చేసారు. దీంతో పాటు 10కోట్ల డిపాజిట్ ని వారి కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నామని కూడా ప్రకటించారు. సినీ కార్మికుల సమస్యలు తనకు స్పష్ఠంగా తెలుసునని వారికి అండగా నిలుస్తానని ప్రామిస్ చేసారు.
దీంతో పాటు సీఎం రేవంత్ చేసిన మరో ప్రకటన తెలుగు చిత్రసీమ నిర్మాతలను ఖంగు తినిపించింది. సినిమా విడుదలై లాభాలొచ్చాక, ఆ లాభాల్లోంచి 20శాతం సినీకార్మికుల నిధికి నిర్మాతలు జమ చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేసారు. అలా చేయని పక్షంలో టికెట్ రేట్ల పెంపు జీవోను విడుదల చేయడం కుదరదని కూడా ఖరాకండిగా తేల్చేసారు.
నిజానికి ఇది ఊహించని ప్రకటన. సినీకార్మికుల న్యాయబద్ధమైన 30శాతం భత్యం పెంపునకు అంగీకరించని నిర్మాతలు ఇప్పుడు ఇంత పెద్ద ప్రతిపాదనకు అంగీకరిస్తారా? తమకు వచ్చే లాభాల్లోంచి 20శాతం డబ్బును కార్మికులకు వదులుకునేందుకు సిద్ధమవుతారా? విక్రమార్కా.. తెలిసీ దీనికి సమాధానం చెప్పకపోయావో నీ బుర్ర వెయ్యి చెక్కలగును!!