సినీకార్మికులకు తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఫెడరేషన్ సన్మానం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ- సినీ కార్మికులకు ఉచిత ఇళ్ల స్థలం అందిస్తామని ప్రకటించారు. అలాగే సినీకార్మికుల పిల్లలకు ఉచిత విద్య- వైద్యం అందజేస్తామని కూడా రేవంత్ మాటిచ్చారు.
ముఖ్యంగా సినీకార్మికుల పిల్లల కోసం ప్రత్యేకించి కార్పొరెట్ స్కూల్ ని ప్రారంభిస్తామని, కేజీ నుంచి ఇంటర్ వరకూ కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను అందజేస్తామని ప్రకటించారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం 10 కోట్ల నిధిని బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. లాభాల్లో 20శాతాన్ని నిర్మాతలు కార్మికులకు అందజేస్తేనే టికెట్ పెంపు జీవో జారీ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీ ఫార్మా తరహాలోనే వినోద పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వినోద పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపును కల్పిస్తామని, గద్దర్ పేరిట ప్రభుత్వం తరపున అవార్డులను కూడా అందజేస్తున్నామని కూడా గుర్తు చేసారు.
హైదరాబాద్ ని సినీహబ్ గా తీర్చిదిద్దుతున్నామని, హాలీవుడ్ కూడా నగరానికి వచ్చేలా బాధ్యత తీసుకుంటామని ప్రకటించారు. తమ ప్రభుత్వం సినీపరిశ్రమకు మద్ధతుగా నిలుస్తుందని అన్నారు. రామోజీ ఫిలింసిటీ సహా నగరంలో హాలీవుడ్ షూటింగులు జరిగేలా అవసరమైన సహకారం అందిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.