దశాబ్ధాల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ కేసు గురించిన సినిమా - హక్. ఈ చిత్రంలో యామి గౌతమ్, ఇమ్రాన్ హష్మి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇది ముస్లిమ్ ప్రపంచంలో పెను ప్రకంపనాలు సృష్టించిన షాభానో కేసుకు సంబంధించిన కథతో రూపొందించిన సినిమా. ఇందులో షాభానో పాత్రలో యామి గౌతమ్ నటిస్తుండగా, ఆమె భర్త పాత్రలో ఇమ్రాన్ హష్మి నటిస్తున్నాడు.
ఇది తలాక్ వ్యవస్థకు భిన్నంగా విడాకులతో ఒంటరి అయిన ముస్లిమ్ మహిళకు రక్షణ కల్పించే చట్టం గురించి చర్చించిన సినిమా. 1985 నాటి చారిత్రాత్మక షా బానో కేసు నుండి ప్రేరణ పొంది రూపొందించారు. షాభానో కేసులో భర్త తన భార్యకు భరణం చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించడం అప్పట్లో సంచలనం. తలాక్ చెప్పి విడాకులు ఇచ్చుకునే ముస్లిమ్ వ్యవస్థలో స్త్రీలకు కూడా భర్తల నుంచి నెలవారీ జీవినభృతితో గ్యారెంటీ కావాలని వాదించిన అరుదైన కేసుగా న్యాయవ్యవస్థ చూసింది. అందుకే ఇప్పుడు ఇమ్రాన్ హష్మి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముస్లిములు అంతా ఈ సినిమాని చూడాలని ఆకాంక్షించాడు.
ఈ సినిమా చేయడం వల్ల తాను మత విశ్వాసానికి చట్టానికి మధ్య ఉన్న లింక్ గురించి తెలుసుకున్నానని అన్నాడు. సంఘాన్ని శాసించే మతపరమైన విశ్వాసాలకు వ్యతిరేకంగా కోర్టులు న్యాయం చేయగలవని కూడా నిరూపణ అయింది. అలాంటి ఒక గొప్ప అంశాన్ని చర్చించే ఈ సినిమా నవంబర్ 7 న విడుదల కానుంది.