తనదైన విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ సంపాదించాడు ఆర్.మాధవన్. అతడిని మ్యాడీ అంటూ అభిమానులు ప్రేమగా పిలుస్తారు. `సఖి` (2000- అలై పోయిదే తమిళ టైటిల్) చిత్రంతో అతడిని మణిరత్నం వెండితెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. నటించిన తొలి సినిమాతోనే అతడు గట్స్ ఉన్న నటుడిగా నిరూపించాడు. కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించాడు. నటుడిగా అతడు చేయని ప్రయోగం లేదు.
ఇటీవలి కాలంలో సైంటిస్ట్ పాత్రలకు ప్రాణం పోస్తున్నాడు. రాకెట్రి: నంబి ఎఫెక్ట్ పేరుతో రూపొందించిన చిత్రంలో అతడు రాకెట్ సైన్స్ పితామహుడు, ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈ సినిమాని స్వీయదర్శకత్వంలో నిర్మించడమే గాకుండా, టైటిల్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. రాకెట్రి చిత్రం 2022లో ఉత్తమ ఫీచర్ ఫిలింగ్ జాతీయ అవార్డును దక్కించుకుంది.
ప్రస్తుతం మాధవన్ మరోసారి భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ఈసారి పారిశ్రామికవేత్త, సైంటిస్ట్ జిడి నాయుడు పాత్రను పోషిస్తున్నాడు. ఈ బయోపిక్ చిత్రాన్ని ట్రైకలర్ బ్యానర్ లో అతడు స్వయంగా భాగస్వాములతో కలిసి నిర్మిస్తున్నాడు. తాజాగా జిడి నాయుడు (జిడిఎన్) ఫస్ట్ లుక్ విడుదలైంది. పోస్టర్ లో బట్టతల కళ్లద్దాలతో మెకానిక్ షెడ్ లో ప్రయోగాలు చేసే వృద్ధుడిగా కనిపిస్తున్నాడు. మాధవన్ అని గుర్తించలేనంతగా అతడిని ప్రోస్థటిక్స్ లో సైంటిస్టుగా మార్చారు. మ్యాడీ ఈ పాత్రలోకి పరకాయం చేసాడని అంగీకరించాలి. కృష్ణ కుమార్ రామ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
తమిళియన్ జిడి నాయుడు ఇండస్ట్రియలిస్టుగా, ఇంజినీరింగ్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్నారు. పారిశ్రామిక రంగంలో పయనీర్ గాను అతడు పాపులరయ్యారు. తమిళనాట ఆయన ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఈసారి కూడా నిజ జీవిత కథతో మ్యాడీ హృదయాలను గెలుచుకోవడం ఖాయం. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ వేగంగా అంతర్జాలంలో వైరల్ అవుతోంది. 2026 వేసవి కానుకగా సినిమా విడుదల కానుంది.