2020లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం తర్వాత పరిణామాల గురించి తెలిసిందే. యువహీరో మరణం వెనక అతడి ప్రియురాలు రియా చక్రవర్తి పాత్రపై తీవ్రమైన దర్యాప్తు సాగింది. డ్రగ్స్ దుర్వినియోగంపై నార్కోటిక్స్ ఏజెన్సీ, ఆర్థిక మోసం అనుమానాలతో సంబంధిత శాఖలు విచారించాయి. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయక్, కుటుంబీకులందరినీ అనుమానించారు. అయితే ఈ కేసుల నుంచి రియా చక్రవర్తి నిర్ధోషిగా బయటపడింది. సీబీఐ నుంచి క్లీన్ చిట్ వచ్చింది.
అయితే ఈ కేసులో కీలకంగా రియా చక్రవర్తి తన కుమారుడు సుశాంత్ నుంచి 15 కోట్లు దండుకుని, నిధుల్ని తప్పు దారి పట్టించిందని తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. సుశాంత్ సింగ్ కుటుంబీకులు కోర్టుకు ఎక్కారు. ఆ తర్వాత సాగించిన సుదీర్ఘ విచారణలో సీబీఐ ఎలాంటి తప్పుడు బ్యాంకింగ్ లావాదేవీలను కనిపెట్టలేదు. రియా చక్రవర్తి, ఆమె కుటుంబీకుల బ్యాంకింగ్ లావాదేవీలను నిశితంగా పరిశీలించాక వారు ఎలాంటి తప్పు చేయలేదని సీబీఐ ధృవీకరించింది. రియా చక్రవర్తి తన సొంత డబ్బుతోనే 80లక్షల ఖరీదు చేసే అపార్ట్ మెంట్ కొనుక్కుంది. దానికోసం హెచ్.డి.ఎఫ్ సి నుంచి 50లక్షల లోన్ తీసుకుంది. 30 లక్షలు డౌన్ పేమెంట్ తన డబ్బు నుంచి చెల్లించిందని సీబీఐ విచారణ రిపోర్ట్ లో పేర్కొంది. అప్పటికి రియా వద్ద 40లక్షల సొంత డబ్బు ఉంది. ఇదే కాదు... 14 నెలల సహజీవనంలో సుశాంత్ సింగ్ 17లక్షలు ఖర్చు చేసాడు. ఇది రియా చక్రవర్తి కోసం అతడి కోసం చేసిన ఖర్చు. బంధంలో ఉన్నప్పుడు ఆ జంట తమకోసం చేసిన ఖర్చు.. దీనిని తప్పు పట్టలేమని సీబీఐ పేర్కొంది.
ముఖ్యంగా సుశాంత్ సింగ్ కి డ్రగ్స్ మత్తు అలవాటు చేసి, అధిక మోతాదులో దానిని అతడికి అలవాటు చేసి ఆత్మహత్యకు ప్రేరేపించిందని కూడా రియాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే దీనిపై దర్యాప్తు చేసిన వైద్య నిపుణులు ఇందులో ఎలాంటి అనుమానాస్పద వ్యవహారాలను కనుగొనలేదు. సుశాంత్ సింగ్ వైద్యులు సూచనల మేరకు మెడిసిన్ తీసుకున్నాడు. అధిక మోతాదును తీసుకోలేదని దిల్లీ ఎయిమ్స్ తుది రిపోర్ట్ పేర్కొన్నట్టు సీబీఐ వెల్లడించింది. మానసిక ఆందోళనలు, తీవ్ర ఒత్తిడికి అతడు మందులు వాడేవాడని కూడా రిపోర్ట్ పేర్కొంది. రియా చక్రవర్తి టాలీవుడ్ లో ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన తూనీగ తూనీగ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.