కరోనా సమయంలో రిలీజైంది `సనమ్ తేరి కసమ్`. హర్షవర్ధన్ రాణే ఈ చిత్రంలో కథానాయకుడు. పాకిస్తానీ బ్యూటీ మావ్రా హుకేన్ కథానాయికగా నటించింది. అయితే రాంగ్ టైమ్ లో రాంగ్ రిలీజ్ తీవ్ర నష్టాలు మిగిల్చింది. కరోనా తర్వాత మళ్లీ ఇదే సినిమాని రీరిలీజ్ చేయగా బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ రీరిలీజ్ లలో అత్యుత్తమ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. సనమ్ తేరి కసమ్ పెద్ద హిట్టవ్వడంతో ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, దర్శకనిర్మాతలకు మంచి పేరొచ్చింది.
హర్షవర్ధన్ రాణే కష్టాల్ని తీర్చిన మూవీ ఇది. ఇప్పుడు ఏక్ దీవానీకి దీవానియాత్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హర్షవర్ధన్ - సోనమ్ బజ్వా ఈ చిత్రంలో జంటగా నటించారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఇది మొదటి రోజు 10కోట్లు, రెండోరోజు 8.80 కోట్లు వసూలు చేసింది. ఇది ఒక చిన్న హీరోకి పెద్ద విజయం. ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చేసాయి. మిగిలినది అంతా లాభమేనని టాక్ వినిపిస్తోంది.
బ్యాక్ టు బ్యాక్ కంటెంట్ ఉన్న కథల్ని ఎంచుకుని, హార్డ్ వర్క్ తో మెప్పిస్తున్న హర్షవర్ధన్ రాణే తదుపరి భారీ చిత్రాల్లో నటించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నాడు. అతడు సౌత్‌లోను తిరిగి రాణించాలని పట్టుదలతో ఉన్నట్టు తెలిసింది. చాలా మంది నటవారసులకు కూడా దక్కని విజయాల్ని ఇప్పుడు అతడు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. నిజమైన పరిణతి, నట ప్రదర్శనతో అతడు దూసుకెళుతున్నాడు. ప్రతిభావంతుడైన హర్షవర్ధన్ రెండు మెట్లు విజయవంతంగా ఎక్కాడు. అక్కడి నుంచి అతడు తనను తాను మరింత బలంగా నిర్మించుకునే ఎత్తుగడలు చాలా కీలకం.