డార్లింగ్ ప్రభాస్ ఈరోజు భారతదేశంలో అతిపెద్ద సూపర్ స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. అతడు పాన్ ఇండియాలో సంచలనాలు సృష్టిస్తూ దేశ విదేశాలలో భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్నాడు. అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `దంగల్` సైతం భారతదేశంలో 500కోట్ల లోపు వసూలు చేస్తే, బాహుబలి 2 ఏకంగా 1400 కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం.
ఇటీవల సలార్, కల్కి 2898 ఏడి లాంటి సంచలన చిత్రాలతో ప్రభాస్ సత్తా చాటాడు. 800 కోట్ల క్లబ్, 1000 కోట్ల క్లబ్‌లతో ప్రభాస్ చెలరేగుతున్నాడు. అయినా కానీ అతడి గొప్పతనాన్ని అంగీకరించేందుకు ఖాన్‌ల త్రయం అభిమానులు ఎప్పుడూ సిద్ధంగా లేరు. ఇప్పుడు కింగ్ ఖాన్ షారూఖ్ ఫ్యాన్స్ తమ ఈగోని సంతృప్తి పరుచుకునేందుకు ఆన్ లైన్ లో వాదనలకు దిగారు. స్పిరిట్ డైలాగ్ టీజర్ లో ప్రభాస్ ని ``భారతదేశంలోనే అతి పెద్ద సూపర్‌స్టార్`` అంటూ పరిచయం చేసిన సందీప్ వంగాను ఖాన్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
షారూఖ్ కి విదేశాలలో ఉన్న స్థిరమైన అభిమానుల గురించి ఉదహరిస్తూ ప్రభాస్ ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఖాన్ దశాబ్ధాల పాటు నిర్మించుకున్న ఫాలోయింగ్ ఇది. కానీ ప్రభాస్ కేవలం గడిచిన 15ఏళ్లలోనే విదేశాలలో అసాధారణ ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు. ఇది అతడి వేగానికి నిదర్శనం. ఏది ఏమైనా ఆన్ లైన్ డిబేట్ పరిశీలిస్తే ఖాన్ ల త్రయంతో పోటీగా నిలబడే సౌత్ హీరోలలో ప్రభాస్ పేరు ముందు వరుసలో ఉందని అందరూ అంగీకరించాలి.