ఆర్జీవీ దర్శకత్వం వహించిన `కంపెనీ` బాలీవుడ్ క్లాసిక్ హిట్ చిత్రాలలో ఒకటి. అద్భుతమైన నటప్రదర్శనలతో ఈ సినిమా హిస్టరీలో ప్రత్యేకంగా నిలిచింది. జైదీప్ సాహ్ని ఈ చిత్రానికి రచయిత. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో మోహన్‌లాల్, అజయ్ దేవ్‌గన్, వివేక్ ఒబెరాయ్, మనీషా కొయిరాలా, అంతారా మాలి, సీమా బిశ్వాస్ నటించారు. హిందీ పరిశ్రమలోకి మోహన్‌లాల్ అరంగేట్ర చిత్రమిది. సత్య (1998) తర్వాత ఆర్జీవీ గ్యాంగ్‌స్టర్ త్రయంలో రెండవ చిత్రమిది. ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించింది. దాదాపు 9.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 25.02 కోట్లు వసూలు చేసింది.
అయితే ఈ సినిమాలో అజయ్ దేవగన్ పోషించిన పాత్రకు తొలుత షారూఖ్ ఖాన్ ని ఎంపిక చేసుకున్నానని ఆర్జీవీ తెలిపాడు. ఖాన్ ఇంటికి వెళ్లి సమావేశమయ్యాడు. కథ పాత్ర తీరు తెన్నుల గురించి చెప్పగానే షారూఖ్ కూడా ఎగ్జయిట్ అయ్యాడు. ఇందులో నటించేందుకు అంగీకరించాడు. కానీ ఎందుకనో ఆర్జీవీ మనసు మార్చుకున్నాడు. ఆ రోజు ఆ సమావేశం ముగిసిన తర్వాత ఖాన్ ఇంటి నుంచి బయటకు వచ్చి అజయ్ దేవగన్ కి ఫోన్ చేసి నువ్వు ఎంపికయ్యావని చెప్పాడు. దీనికి కారణం అలాంటి పాత్రకు దేవగన్ సూటబుల్. షారూఖ్ లాంటి నటుడిని వేరే కోణంలో చూడటం వల్లనే ఆ పాత్రకు ఎంపిక చేయలేకపోయానని తెలిపాడు.
నా తొలి ఎంపిర షారుఖ్ ఖాన్ .. నేను కథ చెప్పగానే అంగీకరించాడు. షారుఖ్ కు ఒక తరహా సహజమైన శరీర భాష ఉందని, చాలా శక్తివంతంగా ఉంటాడని, లైవ్ వైర్ లాగా ఉంటాడని నాకు అనిపించింది. కానీ మాలిక్ పాత్ర వేరు. అతడు డెప్త్ తో ఉంటాడు. ప్రశాంతంగా ఆలోచించేటప్పుడు కూల్ గా ఉండే వ్యక్తి. షారూఖ్ సహజ శక్తి దానికి విరుద్ధంగా ఉంటుందని నేను అనుకున్నాను. షారుఖ్ ను ఇంకా అలా చూపిస్తే అన్యాయం చేసినట్టే అనిపించిందని ఆర్జీవీ గుర్తు చేసుకున్నారు.
ఒక పెర్ఫార్మింగ్ యాక్టర్ ఉంటాడు.. ఆ తర్వాత ఒక నటుడు ఉంటాడు! ఒకరు మరొకరి కంటే మెరుగ్గా ఉంటారని నేను చెప్పడం లేదు కానీ అది వేరే శైలి నటన. షారుఖ్ లాంటి వ్యక్తిని తనకు వదిలేయాలి. అతన్ని వేరే రకమైన పాత్రకు సరిపోయేలా చేయడానికి ప్రయత్నించే దర్శకులకు అది వర్కవుట్ కాదు.. కానీ అజయ్ సహజంగానే ఆ పాత్రకు సరిపోతాడు.. అతను స్వతహాగానే చాలా ప్రశాంతంగా ఉంటాడు. అందుకే నేను అజయ్‌ను ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.
నేను షారుఖ్‌తో ఒకసారి మాత్రమే సమావేశమయ్యాను.. అది పనిచేయదని నేను గ్రహించాను.. కానీ నేను అతడికి నేను ఆ విషయం చెప్పలేదు అని వర్మ తెలిపారు. ప్రస్తుతం ఆర్జీవీ హర్రర్ కామెడీ `పోలీస్ స్టేషన్ మెయిన్ భూత్` కోసం మనోజ్ బాజ్‌పేయితో కలిసి పని చేస్తున్నాడు.