తమిళ ట్యాలెంటెడ్ హీరో విష్ణు విశాల్ క్రీడాకారిణి జ్వాలా గుత్తాను పెళ్లాడి హైదరాబాద్ అల్లుడు అయిన సంగతి తెలిసిందే. తమిళ సినీపరిశ్రమలో హీరోగా విజయాలు సాధించాక కూడా విష్ణు విశాల్ కెరీర్ ఆశించిన స్థాయికి ఎదగలేదు. కెరీర్ ఎదుగుదల గురించి విశ్వప్రయత్నాలు చేస్తున్నా పట్టు చిక్కడం లేదు. ప్రస్తుతం అతడు తన తదుపరి రిలీజ్ `ఆర్యన్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఆర్యన్ ప్రీరిలీజ్ వేడుకలో విష్ణు విశాల్ మాట్లాడుతూ .. ఇండస్ట్రీ నుంచి తనకు ఎలాంటి సపోర్ట్ దక్కలేదని వాపోయాడు.
తాను రెండు హిట్లు కొట్టాక కూడా తొమ్మిది సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని, అప్పటికే సెట్స్ పై ఉన్న సినిమాలకు నిర్మాతలు పదే పదే మారారని కూడా గుర్తు చేసుకున్నాడు. తాను విజయం సాధించినప్పుడు తన సహచర హీరోలు కనీసం ఫోన్ చేసి అయినా అభినందించలేదని, ఇవన్నీ తనకు గుర్తుండిపోయాయని ఆర్యన్ ప్రీరిలీజ్ వేదికపై ఆవేదన వ్యక్తం చేసాడు. తనకు హిట్లు ఇచ్చిన దర్శకులకు మాత్రం సదరు హీరోలు టచ్ లో ఉన్నారు. వారితో ఫోన్లు చేసి మాట్లాడతారు. నేను ఎవరిపైనా ఫిర్యాదు చేయాలనుకోవడం లేదు. చిత్రపరిశ్రమలో ఏం జరుగుతోందో చెబుతున్నానని విష్ణు విశాల్ అన్నాడు.
నా సినిమా `గట్టకుస్తీ`కి పని చేసేప్పుడు ఆరుగురు నిర్మాతలు మారారు. ఎఫ్ఐఆర్ చిత్రీకరణ సమయంలో ముగ్గురు నిర్మాతలు మారారు. మరో సినిమా చిత్రీకరణ సమయంలో నలుగురు నిర్మాతలు మారారని గుర్తు చేసుకున్నారు. రచ్చాసన్ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత కూడా తొమ్మిది సినిమాలను కోల్పోయానని విష్ణు విశాల్ ఆవేదన చెందారు. తాను ఇంకా అర్హత సాధించలేదేమో! అనే భావనలో ఉన్నానని అతడు బాధను వ్యక్తపరిచాడు. ముఖ్యంగా పరిశ్రమ సహచరుల ప్రవర్తన తనను బాధించిందని అన్నాడు.