ఈ ప్రముఖ హీరో నిజ జీవిత కథ `యానిమల్` స్టోరీని తలపిస్తుంది. నిజ జీవితంలో నిత్యం తన తండ్రితో ఘర్షణ పడే కొడుకు నిజ కథ ఆశ్చర్యపరచకుండా ఉండదు. తండ్రి ఎప్పుడూ పబ్లిక్ లోనే ఎదిగొచ్చిన కొడుకును తిట్టి అవమానిస్తాడు.. అయినా దానిని ఆ కొడుకు మౌనంగా భరించేస్తాడు. ఇంట్లో ఎప్పుడూ కోపిష్ఠి తండ్రి తన తల్లిని తిడుతుంటే మెట్లపై కూచుని యువకుడైన అతడు ముఖాన్ని దాచుకుని ఏడుస్తాడు. తన తండ్రిని అప్పటికప్పుడు ద్వేషిస్తాడు.. ప్రేమిస్తాడు.. అపారంగా గౌరవిస్తాడు. కానీ ఇద్దరి మధ్యా ఏదో సంఘర్షణ. జీవితంలో ఎప్పుడూ ఆ ఇద్దరూ ఒకరికొకరు దగ్గర కాలేకపోయారు.
చివరికి తన తండ్రి కఠిన వైఖరిని ఆ కొడుకు చాలాసార్లు నిలదీసే ప్రయత్నం చేసాడు. సినిమా కథల ఎంపికలు సహా చాలా విషయాలలో తన తండ్రి ఫింగరింగ్ ని కూడా అతడు సహించలేదు. అతడు స్వేచ్ఛగా స్వతంత్య్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రాధాన్యతనిచ్చాడు. అయితే పబ్లిగ్గా తనను తిడుతున్నా అతడు మౌనంగా ఉండేవాడు. తన తల్లికి చెప్పుకునేవాడు. అయితే తండ్రితో ఎన్ని ఘర్షణలు ఉన్నా కానీ, తన వృత్తి లో అతడు నంబర్ వన్ స్థానానికి ఎదిగాడు.
ఈ కథంతా ఎక్కడో విన్నట్టే ఉంది! అనుకుంటే... దానికి సమాధానం -`యానిమల్` సినిమా చూసిన వారికి స్పష్ఠంగా తెలుసు. ఇప్పుడు చెప్పుకున్న కథంతా రణబీర్ కపూర్ నిజ కథ. తన తండ్రి రిషీ కపూర్ తో నిరంతరం ఘర్షణపడేవాడు రణబీర్. అతడి సినిమా కథల ఎంపికలు సహా చాలా విషయాల్లో రణబీర్ పూర్తిగా మాడ్రన్‌గా ఆలోచించాడు. కానీ రిషీకపూర్ సాంప్రదాయ సినిమాను మాత్రమే ఇష్టపడేవారు. ఇది ఆ ఇద్దరి మధ్యా ఘర్షణను వాగ్వాదాన్ని పెంచి పోషించింది.
అయితే ఎంతగా గొడవ పడినా వారి మధ్య పరస్పర గౌరవం, ప్రేమాభిమానాలకు కొదవేమీ లేదు. ఈ విషయాలన్నిటినీ స్వయంగా దగ్గరగా చూసిన వాడిగా ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ తాజా ఇంటర్వ్యూలో రహస్యాలను బహిర్గతం చేసారు. సుభాష్ ఘయ్ చెప్పిన విషయాల ఆధారంగా పరిశీలిస్తే.. సందీప్ రెడ్డి వంగా చాలా తెలివిగా రణబీర్ నిజ జీవిత ఘర్షణకు సంబంధించిన థ్రెడ్ ని యానిమల్ కోసం ఉపయోగించుకున్నాడని భావించాలి.