మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ని ఉపయోగించుకుని కొందరు తప్పుడు మార్గంలో వాణిజ్య ప్రయోజనాల కోసం, ప్రచారం కోసం ఆయనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, స్వరం, బిరుదులు వంటి వాటిని దుర్వినియోగం చేస్తే దానికి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. కొందరు సెలబ్రిటీల అనుమతి లేకుండా ఫోటోలు సహా వారి వ్యక్తిగత ఇమేజ్ ని వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించుకోవడాన్ని చట్టం అంగీకరించదు. కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం, మార్ఫింగ్ వంటి వాటికి కోర్టులు ఇటీవల చెక్ పెట్టేస్తున్నాయి.
తమ వ్యక్తిగత ఇమేజ్ కి భంగం కలగకుండా, గోప్యతను, హక్కులను కాపాడుకునేందుకు ఐశ్వర్యారాయ్ - అభిషేక్ బచ్చన్ జంట కోర్టుల పరిధిలో పోరాటం సాగించిన సంగతి తెలిసిందే. ఇది సానుకూల ఫలితాన్ని ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున కూడా కోర్టును ఆశ్రయించి తనకు మాత్రమే హక్కు ఉండే తన ఇమేజ్ ని, ఫోటోలు, వీడియోలు వంటి వాటిని తప్పుడు విధానంలో ఇతరులు ఉపయోగించకుండా చట్టపరమైన భరోసాని సంపాదించారు.
ఇప్పుడు ఇదే కేటగిరీలో మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లో స్థానిక కోర్టును ఆశ్రయించగా, సానుకూల తీర్పు వెలువడింది. ఈ తీర్పు ప్రకారం.. చిరుకు మాత్రమే హక్కు ఉండే ఫోటోలు, వీడియోలు, వాయిస్ లను ఎవరూ కాపీ చేయడానికి లేదు. ఆయన బిరుదులను కూడా దుర్వినియోగం చేయలేరు. అలాగే ఏఐలో చిరంజీవి ఇమేజ్ లను వీడియోలను ఫేకింగ్ చేసినా కూడా అది శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది.
ఇకపై చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేయడం కుదరదు. చిరంజీవి లేదా సెలబ్రిటీల అనుమతి లేనిదే వారికి సంబంధించిన ఎలాంటి విషయాన్ని కూడా వేరొకరు వినియోగించుకోలేరు. సంఘంలో ప్రముఖుల ఇమేజ్ కి డ్యామేజీ కలిగించేలా ఆన్ లైన్ డిజిటల్ వేదికగా చాలా ఫేక్ వీడియోలు దర్శనమిస్తున్నాయి.
కొన్ని శృంగార వెబ్ సైట్లలోను వీళ్ల పేర్లు లేదా ఫోటోలను డ్రాగ్ చేస్తుండటంతో అది వారి పరువు ప్రతిష్ఠలకు తీవ్ర భంగం కలిగిస్తోంది. ఇకపై వీటన్నిటికీ కోర్టు చెక్ పెట్టనుంది. మెగాస్టార్ చిరంజీవి పేరు లేదా ఇమేజ్ ని సొంత ప్రయోజనాల కోసం అనుమతి లేకుండా దుర్వినియోగం చేస్తున్న కొన్ని వెబ్ సైట్లపైనా కేసులు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు.