రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ ఏం చేసినా అది సంచలనమే. కథానాయికలతో నగ్న ఫోటోషూట్లు, సన్నిహిత వీడియో షూట్లు, చుంబనాలు వగైరా వగైరా సెన్సేషన్స్‌తో ఇటీవలి కాలంలో ఆర్జీవీ చర్చల్లోకొచ్చారు. రాజకీయ నాయకులపై వ్యంగ్య కథనాలను తెరకెక్కించిన ఆర్జీవీ తీవ్రమైన వివాదాలను నెత్తికెత్తుకున్నారు.
ఇక సోషల్ మీడియాల్లోను ఆర్జీవీ నిరంతరం వివాదాలకు ఆజ్యం పోసే వ్యాఖ్యలతో రెచ్చిపోవడం చర్చనీయాంశమైంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఆయన గాజా మారణ హోమం- బాంబు దాడులతో మన దేశ సాంప్రదాయ పండగ దీపావళిని పోల్చారు. ``భారతదేశంలో ఒకే ఒక రోజు దీపావళి.. గాజాలో ప్రతి రోజు దీపావళి`` అని ఆర్జీవీ ఎక్స్ లో పోస్ట్ చేసారు. అయితే దీనిపై చాలా మంది విరుచుకుపడ్డారు.
ఆర్జీవీ ద్వేషపూరిత వైఖరిని పలువురు నిరసించారు. మానవత లేకుండా ఇలా వ్యాఖ్యానించడం సరికాదని కొందరు సూచించారు. శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ..``మన దీపావళి పండగను గాజా యుద్ధ నేరంతో పోల్చడాన్ని ఊహించుకోండి. కనీసం ఈ సామాజిక మాధ్యమాల కారణంగా అయినా ఇలాంటి విద్వేషపూరితమైన వ్యక్తిని గుర్తించగలిగాము`` అని వ్యాఖ్యానించారు. మారణ హోమం, శిశు హత్యలతో దీపావళి సెలబ్రేషన్ ని పోల్చడం సరికాదని ఒక ప్రముఖుడు అన్నారు.