తండ్రి కేసీఆర్ ని కాదని, అన్న కేటీఆర్ తో వాదనపెట్టుకుని బీఆర్ఎస్ నుంచి గెంటించుకుని కొత్త పార్టీ పెడుతుంది అనుకున్న కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీ విషయం పక్కనపెట్టి తెలంగాణ జాగృతి ని పటిష్టం చేస్తుంది. హరీష్ రావు పై డైరెక్ట్ యుద్ధం ప్రకటించడంతో కవితను కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు.
తన తండ్రి మాట్లాడకపోయినా.. తన తల్లి తనతో మాట్లాడుతుంది.. అన్న కేటీఆర్ కూడా హరీష్ రావు ని నమ్మితే నట్టేట ముంచెస్తాడు అంటూ చెప్పిన కవిత కొత్త పార్టీ పెడుతుందేమో అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. కేసీఆర్ అంటే పడని వాళ్ళు, అసంతృప్తి నేతలు కవిత ను సపోర్ట్ చేస్తూ కవిత పార్టీలో చేరుదామని చూస్తున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ ఉన్న సమయంలోనే పార్టీ పెడితే దానిని అప్పటివరకు హ్యాండిల్ చెయ్యడం కష్టం అనుకుందేమో కవిత.
ఇప్పుడొక ప్లాన్ చేసింది. అందులో భాగంగా కవిత సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల చివరి వారంలో యాత్రను ప్రారంభించి అన్ని జిల్లాల మీదుగా యాత్ర కొనసాగేలా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అది కడుఆ మాజీ సీఎం, స్వయానా తండ్రి కేసీఆర్ ఫొటో లేకుండా యాత్ర చేయాలని కవిత నిర్ణయం తీసుకుందట.
ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతో యాత్ర పోస్టర్లు డిజైన్ చేయాలని జాగృతి శ్రేణులకు కవిత ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా తెలంగాణ మేధావులు, విద్యావంతులతో కవిత వరుస భేటీలు నిర్వహిస్తుంది. రేపు బుధవారం యాత్ర పోస్టర్ విడుదల చెయ్యనున్నట్లుగా తెలుస్తుంది. మరి కవిత పక్కా ప్లాన్ లో భాగంగానే ఈయాత్ర మొదలు పెట్టి రెస్పాన్స్ ను బట్టి పార్టీని అనౌన్స్ చేస్తుందేమో చూడాలి.