అది బాలీవుడ్ లో పాపులర్ నిర్మాణ సంస్థ. వరుసగా క్లాసిక్స్ ని నిర్మించింది. యష్ రాజ్ ఫిలింస్‌కి ధీటైన పేరు ఈసంస్థకు ఉంది. పక్కా ఫ్యామిలీ ఆడియెన్ మెచ్చే ఆహ్లాదకరమైన సినిమాలు తీసే సంస్థగాను గుర్తింపు ఉంది. కానీ సంస్థ కొన్ని కారణాలతో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంది. చివరకు ఈ బ్యానర్ లో సినిమాలు తీయలేని దుస్థితి కూడా వచ్చింది.
సరిగ్గా అలాంటి సమయంలో సదరు నిర్మాత తెలివిగా తన స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్తకు ఈ సంస్థను విక్రయించాడు. సగం వాటా అమ్మకం ద్వారా అతడు 1000 కోట్ల వరకూ ఆర్జించాడు. అయితే ఈ సంస్థలో సగం వాటాను అమ్మేసిన కారణంగా తాము సృజనాత్మకత పరంగా ఎలాంటి నియంత్రణలోకి వెళ్లలేదని చెప్పాడు. తాము స్వేచ్ఛగా సినిమాలు నిర్మిస్తున్నామని తెలిపారు.
ఈ ఎపిసోడ్ మొత్తం ప్రముఖ సినీనిర్మాత కరణ్ జోహార్ గురించే. ఆయనకు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నుంచి సీరం ఇనిస్టిట్యూట్ అధినేత ఆధార్ పూనవల్లా 50శాతం వాటాను కొనుగోలు చేసేందుకు వెయ్యి కోట్లు చెల్లించాడు. ఆ తర్వాత ధర్మ ప్రొడక్షన్స్ విస్తరణకు ఆధార్ పూనవాలా సహకరించాడు.
అయితే ఈ సంస్థలో సగం వాటా మాత్రం కరణ్ జోహార్ అతడి స్నేహతుడు అపూర్వ మెహతాకు చెందుతుంది. ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ వీళ్లు ఇద్దరూ చూసుకుంటారు. సంస్థ విస్తరణ పనులన్నీ ఆధార్ పూనవల్లా నిర్వహిస్తున్నారు. అయితే ధర్మ ప్రొడక్షన్స్ లో వాటా అమ్మేయాలనుకోవడానికి కారణం ఏమిటో తాజా చాటింగ్ సెషన్ లో చెప్పుకొచ్చారు. ఆధార్ పూనవాలా తనకు, తన ఫ్యామిలీకి అత్యంత గొప్ప స్నేహితుడు అని సినీరంగంలో తన వ్యాపారాలను విస్తరించాలని భావిస్తున్నట్టు తనకు చెప్పాడని వెల్లడించారు.
భాగస్వామి రాకతో మరింత బాధ్యత పెరిగింది. సృజనాత్మక విభాగంలో వారి నియంత్రణ లేదు! అని తెలిపాడు. ఇటీవల ధర్మ ప్రొడక్షన్స్ ఆడియో రంగంలోను ప్రవేశిస్తోంది. రకరకాల విస్తరణ పనులను చేపడుతున్నారు. అయితే అగ్ర హీరోలతో సినిమాల కంటే పరిమిత బడ్జెట్ లో సినిమాలకు తెరకెక్కించేందుకు కరణ్ ఆసక్తిగా ఉన్నారు.