ఇటీవలి కాలంలో సోషల్ మీడియాల్లో విపరీత పోకడలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఎవరు ఎవరిని అయినా కించపరచడానికి ఇన్ స్టా, ఎక్స్ వంటి ఖాతాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కి తీవ్ర అవమనం ఎదురైంది. ఎక్స్ ఖాతాలో ఖుష్బూ పోస్ట్ చేసిన ఓ రాజకీయ వ్యాఖ్యానానికి ప్రతిస్పందించిన నెటిజన్ ఒకరు ``నీ ఎనిమిదో తరగతి స్టడీ గురించి నాకు తెలుసు. పొలిటికల్ కామెంట్ల కోసం చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నావా?`` అంటూ అవమానకరంగా మాట్లాడారు.
అయితే దీనికి ఖుష్బూ సుందర్ అంతే ధీటుగా స్పందించారు. ఇంటెలిజెన్స్ అనేది నువ్వు సాధించే రిపోర్టులు మార్కులను బట్టి ఉండవు. జీవితానుభవాల నుంచి పుట్టుకొస్తాయని అన్నారు. కామరాజర్ అంతటి గొప్ప రాజనీతిజ్ఞుడు కూడా 4వ తరగతి దాటి చదువుకోలేకపోయారు. కాబట్టి సోదరా మీరు విశ్రాంతి తీసుకోండి.. నా ఆలోచనలు చెప్పడానికి చాట్ జీపీటీ అవసరం లేదు! అని ఖుష్బూ కౌంటర్ రాసారు.
సోషల్ మీడియాల్లో ఏదైనా కామెంట్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. చెడు వ్యాఖ్యలను మానుకోవాలి. ముంబైలో విద్యాభ్యాసం కొనసాగించిన ఖుష్బూ చాలా చిన్న వయసులోనే సినీరంగంలో బాలనటిగా అడుగుపెట్టారు. అటుపై దక్షిణాదిన అగ్ర కథానాయికగా ఏలారు. బాలీవుడ్ సహా అన్ని దక్షిణాది భాషల్లోను ఖుష్బూ నటించారు. చాలా కాలంగా భాజపా నాయకురాలిగా ప్రజా జీవితంలో ఖుష్బూ మమేకం అయ్యారు.