ఐశ్వర్యారాయ్- అభిషేక్-అమితాబ్ లాంటి స్టార్లు నటించిన `బంటి ఔర్ బబ్లి` బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా `కజ్రారే..` పాట కారణంగా నిరంతరం వార్తల్లో నిలిచింది. ఈ పాట పాడిన గాయని స్వరం నిజంగా హృదయాలను హత్తుకుపోయింది. దశాబ్ధాల పాటు పెళ్లి వేడుకలు, విందు కార్యక్రమాలలో ప్రధానంగా వినిపించిన పాట ఇది. అయితే ఈ పాటను ఆలపించిన గాయనికి నాడు ఎలాంటి అవమానం జరిగిందో తెలిస్తే నిజంగా హృదయం చలించిపోతుంది.
ప్రఖ్యాత గాయని అలీషా చినై చార్ట్ బస్టర్ `కజ్రారే..` పాటను ఆలపించారు. అలీషా అప్పటికే `మేడ్ ఇన్ ఇండియా` పాటతో దేశవ్యాప్తంగా ఒక సంచలనం. అంత పెద్ద గాయనికి యష్ రాజ్ ఫిలింస్ కజ్రారే లాంటి హిట్టు పాట పాడినందుకు రూ. 15000 చెక్కు పంపించారట. శంకర్ ఎహసాన్ లాయ్ లాంటి పెద్ద సంగీత దర్శకులు సిఫారసు చేయగా, యష్ రాజ్ బ్యానర్ కాబట్టి పాడానని అలీషా తెలిపారు.
ఆ చెక్కును తాను అందుకోకపోవడంతో పదే పదే తనకు అందజేయడానికి నిర్మాతలు ప్రయత్నించారని కూడా అలీషా చెప్పారు. ఆ తర్వాత తాను బహిరంగంగా జరిగిన దానిని ప్రస్థావించగా, యష్ రాజ్ బ్యానర్ కి అది నచ్చలేదని, తనపై రాజకీయాలు చేసారని కూడా అలీషా తెలిపారు. ఆ తర్వాత అలీషా బాలీవుడ్‌లో పాడనని శపథం చేసారు. నేటితరం గాయనీగాయకులు తమను తాము తగ్గించుకుని తక్కువ జీతాలకు పని చేస్తున్నారని, కొందరికి అయితే ఎలాంటి భత్యం చెల్లించరని కూడా అలీషా వెల్లడించింది.