సౌత్ - నార్త్ రెండు చోట్లా సుపరిచితుడైన నటుడు షాయాజీ షిండే. థియేటర్ రంగంలో నిరూపించుకుని పెద్దతెరకు ప్రమోటైన మేటి ప్రతిభావంతుడు. ఆయన తొలుత మరాఠాలో స్టేజీ నాటకాలతో పాపులరై, అటుపై మరాఠా చిత్రసీమలో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లారు. అదే క్రమంలో దక్షిణాదిన తెలుగు చిత్రాలతో పాపులరై, అన్ని దక్షిణాది ఉత్తరాది భాషల్లోను నటించారు. మహారాష్ట్రలోని ఒక గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన షాయాజీ షిండే ఎంతో నిరాడంబర జీవితం గడిపారు.
ఇప్పుడు ఆయన సౌతిండియన్ స్టార్ల మర్యాద, వినయం, గౌరవం గురించి బహిరంగంగా మాట్లాడారు. బాలీవుడ్ నటులతో పోలిస్తే దక్షిణాది స్టార్లు ఎంతో వినయవిధేయతలతో, గౌరవంగా వ్యవహరిస్తారని తెలిపారు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడంలో గొప్పవారు అని అన్నారు. ఒక ఉదాహరణగా చెబుతూ.. ఒకసారి సెట్లో తాను ఒక చెట్టు నీడలో కూచుని ఉన్నప్పుడు రజనీకాంత్ తనను పిలిచి అడిగారని, ఆ తర్వాత లోనికి పిలిచి తనతో ఫుడ్ షేర్ చేసుకున్నారని నాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు తనకోసం వచ్చిన ధానిమ్మ రసాన్ని ముందుగా షాయాజీ షిండే చేతికి ఇవ్వాలని కూడా రజనీ తన సిబ్బందికి సూచించారు.
`భారతి` అనే చిత్రంలో షాయాజీ నటన గురించి ఆ రోజు అందరికీ చెప్పారని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మెజారిటీ చిత్రాల్లో షాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు. ఠాగూర్, వీడే, గుడుంబా శంకర్, పోకిరి, అతడు, దూకుడు ఇలా చాలా సినిమాల్లో షాయాజీ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఆయన జన్మతః మరాఠీ అయినా తెలుగు నేర్చుకుని మరీ అద్భుతంగా సంభాషించారు. దాదాపు ఐదారు భాషల్ని అనర్గళంగా మాట్లాడగల నేర్పరి.