టబు నటించిన క్లాసిక్ చిత్రం `చాందిని బార్` రీరిలీజ్‌కి సిద్ధంగా ఉందని ఇటీవల కథనాలొచ్చాయి. మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించినందున ఈ సినిమా అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలలో ఒకటి. ఇప్పుడు ప్రతి ఒక్కరి మనస్సులో ఉన్న ప్రశ్న టబు ఆ పాత్రను తిరిగి చేస్తుందా లేదా? అనే సందేహం వ్యక్తమైంది.
తాజా సమాచారం మేరకు `చాందిని బార్ 2` కోసం నిర్మాతలు టబుతో చర్చలు జరుపుతున్నారని నిర్మాణ సంస్థకు దగ్గరగా ఉన్న ఒక సోర్స్ వెల్లడించింది. సీక్వెల్ ఎమోషనల్ డెప్త్‌కు టబు చాలా అవసరం. కాబట్టి మేకర్స్ తనను మాత్రమే దృష్టిలో ఉంచుకుని స్క్రిప్టును రెడీ చేసారు. ఇలాంటి సమయంలో జాతీయ ఉత్తమ నటి లేకుండా సినిమా తీయడం కుదరదని మేకర్స్ నిర్ణయించినట్టు తెలిసింది.
`చాందిని బార్` ఒక వేశ్య కథ. వేశ్య పాత్రలో టబు అద్భుతమైన నటప్రదర్శనకు జాతీయ అవార్డ్ దక్కింది. చాందిని బార్ 2 నేటి తరం కోసం రాసుకున్న కథ అని నిర్మాతలు నిర్ధారించారు. ఒరిజినల్ చిత్రం వచ్చిన 25 సంవత్సరాల తర్వాత సెట్స్ పైకి వెళుతోంది. టబు ప్రస్తుతం చాలా సినిమాలను చేస్తోంది. భూత్ బంగ్లా, భోలా 2, దే దే ప్యార్ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.