ఇటీవలి కాలంలో ఏదైనా సినిమాకి కేటాయించే బడ్జెట్ లో సగం పైగా స్టార్ హీరో- స్టార్ డైరెక్టర్ ఇద్దరికే వెళ్లిపోతోంది. 300 కోట్ల బడ్జెట్ పెడితే, 100 కోట్లు హీరోకి, 50 కోట్ల డైరెక్టర్ కి అప్పగించాల్సి వస్తోంది. అయితే ఈ ఫార్ములాకు భిన్నమైన విధానాన్ని అనుసరిస్తున్నారు `రామాయణం` నిర్మాత నమిత్ మల్హోత్రా. ఆయన ప్రకారం.. రామాయణం ఫ్రాంఛైజీ చిత్రాల కోసం ఏకంగా 3,330 కోట్ల బడ్జెట్ ని కేటాయించారు. దీని నుంచి 20: 80 థామాషా ప్రకారం 20శాతం హీరో డైరెక్టర్, రచయితల టీమ్ కోసం కేటాయించారు. మిగతా 80శాతం క్వాలిటీ మేకింగ్ కోసం ఖర్చు చేస్తారు. ఇందులోనే ఇతర శాఖలు, టీమ్ లకు డబ్బు చెల్లిస్తారు.
ముఖ్యంగా పురాణేతిహాస కథ కోసం వీఎఫ్ఎక్స్, సంగీతం, సెట్ల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. యాక్షన్ విభాగం కూడా రిస్కులతో కూడుకున్నది.. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో కూడుకున్నవి గనుక చాలా బడ్జెట్ ని వెచ్చించాల్సి ఉంటుంది. అయితే హీరో డైరెక్టర్ కే సగభాగం బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం లేకపోవడంతో ఇప్పుడు విజువల్స్ పరంగా రాజీ అన్నదే లేకుండా తెరకెక్కిస్తున్నారని భావించాలి.
రామాయణం ఫ్రాంఛైజీని నమిత్ మల్హోత్రా- యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, ఆంజనేయుడిగా సన్నీడియోల్, రావణుడిగా యష్ నటిస్తున్నారు. పార్ట్ 1 చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. మొదటి టీజర్ ఇప్పటికే ప్రజల్లోకి దూసుకెళ్లింది. వచ్చే ఏడాది మొదటి భాగం సినిమా విడుదలవుతుంది.