సినీపరిశ్రమకు మంచి రోజులు ఎప్పుడు వచ్చినట్టు? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఆసక్తికరమైనది. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేయడానికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు.. ప్రభుత్వాలే సినిమా టికెట్ రేట్లను నచ్చినట్టు పెంచుకోమని నిర్మాతలకు చెప్పినప్పుడు..!!
ఆ కోణంలో చూస్తే, ఇప్పుడు సినిమా టికెట్ ధరలను నిర్మాతలు తమకు అనుకూలంగా పెంచుకునే వెసులుబాటు ఉంది. మొదటి పది రోజులు టికెట్ ధరల్ని 500 నుంచి 1000 మధ్యలో అమ్ముకోవచ్చు. పెయిడ్ ప్రీమియర్స్ పేరుతో ఎంతకైనా అమ్ముకోవచ్చు. పెద్ద సినిమాలకు తొలి 10రోజులు ఇలాంటి ఆప్షన్లను ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి. బడ్జెట్లు అదుపు తప్పిన సినిమాలకు తప్పనిసరిగా టికెట్ ధరల్ని పెంచాల్సి ఉంటుంది. కానీ పెద్ద సినిమా పేరుతో ఎవరైనా పెంచుకుంటేనే సమస్య.
అయితే ఇలాంటి అవకాశం కల్పించని ఏ ప్రభుత్వం ఉన్నా, అది వినోదపరిశ్రమకు అశనిపాతం అవుతుంది. చాలా మొండిగా పంతం పట్టి 90లలో రేట్లు ఉన్నట్టే రూ.10కే నేల టికెట్, రూ.15కే బెంచీ, 20కే రిజర్వుడ్ చైర్ అంటూ సినిమా ఇండస్ట్రీని తగ్గించాలనుకునే రాజకీయ నాయకులు లేనంత కాలం సినిమాకి మంచి రోజులు వచ్చినట్టే.
అయితే ఇక్కడ నిర్మాతలు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఒక కుటుంబం వారాంతంలో సినిమా చూడాలనుకుంటే, ప్రస్తుతం పెరిగిన ధరలతో 4000 టికెట్లకు, 2000 పాప్ కార్న్ కోక్ డబ్బాలకు పెట్టగలడా? అన్నదే పెద్ద ప్రశ్న. ఇబ్బడిముబ్బడిగా డబ్బు సంపాదించే అధిక ఆదాయ వర్గాలు ఉన్నది కేవలం 5 శాతం లోపే, 70 శాతం జనం కచ్ఛితంగా తక్కువ జీతంపై ఆధారపడి జీవించేవాళ్లే అని తెలిసినా కూడా నిర్మాతలు ఇలాంటి సాహసాలకు ఎలా పాల్పడగలరు?
అందుకే ఇటీవలి కాలంలో కొన్నిసార్లు బావున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. జనాల్ని థియేటర్లకు తోలలేక నానా హైరనా పడుతున్నారు. మంచి సినిమా తీసామని క్రిటిక్స్ పొగిడేసినా, జనం థియేటర్లకు రావడం లేదు! అని చెప్పుతో కొట్టుకున్న నిర్మాతలా అయిపోతుంది ఇండస్ట్రీ మొత్తం పరిస్థితి.