ప్రముఖ అస్సామీ గాయకుడు జుబిన్ గార్గ్ ఆకస్మిక దుర్మరణం అభిమానులను కలచివేసిన సంగతి తెలిసిందే. సింగపూర్ లో ఓ క్రూయిజ్ షిప్ పార్టీలో ఉండగా ప్రమాదం సంభవించగా, అతడిని ఆస్పత్రికి చేర్చినప్పుడు మరణించాడని కథనాలొచ్చాయి. మొదట అతడు కూబా డైవింగ్ సమయంలో ఊపిరాడక మరణించాడని కథనాలొచ్చినా వాటిని నిర్వాహకులు కొట్టి పారేసారు.
అయితే 52 ఏళ్ల జుబిన్ ఆకస్మిక మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సింగపూర్ నుంచి భారత్ కి తరలివచ్చిన జుబిన్ పార్థీవ దేహాన్ని, అస్సాం గౌహతిలోని స్వగృహానికి తీసుకొచ్చే సమయంలో అశేష జనవాహిని అతడి యాత్ర రథాన్ని చుట్టుముట్టింది. చాలా మంది ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. అతడి పాటలను పాడుతూ నివాళి అర్పించారు.
రెండు రోజుల పాటు అతడి పార్థీవ దేహాన్ని సందర్శనార్థం ఉంచిన తర్వాత అంతిమయాత్రను నిర్వహించారు. ఈ యాత్రకు లక్షలాదిగా జనం పోటెత్తారు. ఒక గాయకుడికి ఈ స్థాయి ఆదరణ, ప్రేమాభిమానాలను చూడటం ఇదే మొదటిసారి. గాయకులకు స్వతహాగా ఫాలోయింగ్ ఉంటుంది కానీ అంతిమయాత్రలో ఇంతగా గుమిగూడి ఊకవేస్తే రాలనంత మంది కనిపించడం అనేది ఒక రికార్డ్. అందుకే జుబిన్ పేరు ఇప్పుడు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. మైఖేల్ జాక్సన్, ప్రిన్స్ ఫ్రాన్సిస్, క్వీన్ ఎలిజబెత్-2 తర్వాత మళ్లీ భారతీయ గాయకుడు జుబిన్ కే ఇలాంటి రికార్డ్ సాధ్యమైంది. ఒక అంతిమయాత్రకు అత్యధికమంది ప్రజలు హాజరవ్వడం అనేది ఒక రికార్డ్ గా నిలిచిపోయింది. ప్రస్తుతం జుబిన్ అంతిమయాత్ర ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. జుబిన్ పాట అస్సామీల సంస్కృతిలో ఒక గొప్ప ఎమోషన్ ని డ్రైవ్ చేసింది. ప్రపంచానికి అస్సామీలను పరిచయం చేసినది అతడి పాట మాత్రమేనని నమ్ముతారు. అతడు బాలీవుడ్ లో ప్రముఖ గాయకుడిగా వెలిగిపోయారు. అన్ని భాషల్లోను అతడి పాటలు పాపులరయ్యాయి.