కంప్లీట్ స్టార్, సూపర్ స్టార్.. బిరుదు ఏదైనా, పిలుపు ఏదైనా.. దిగ్గజ నటుడు మోహన్ లాల్ అంటే దక్షిణాది ఉత్తరాది అన్నిచోట్లా ఒక ప్రత్యేకమైన గౌరవం. ఆయనను సీనియర్ నటుడిగా, నటనా రంగానికి డిక్షనరీగా భావించి గౌరవిస్తుంది నేటితరం. కెరీర్ లో ఎన్నో అసాధారణ విజయాలను సాధించిన మోహన్ లాల్ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు.
ఇప్పుడు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని గెలుచుకున్న ఆనందంలో ఉన్నారు లాల్. ఆయన 1978లో తిరునాట్టం అనే చిత్రంతో కథానాయకుడిగా ఆరంగేట్రం చేసారు. 1986 లో ఏకంగా 34 సినిమాల్లో నటించడం ఒక రికార్డ్. నిర్మాతగా, గాయకుడిగా, దర్శకుడిగాను ఆయన సత్తా చాటారు.
2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారు. రెండుసార్లు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు. 9 సార్లు కేరళ ఉత్తమ నటుడిగా అవార్డులు ఆయనను వరించాయి. 9 సార్లు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ లు అందుకున్నారు.
నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు సేవలందిస్తున్న లాల్ ఫాల్కే పురస్కార గౌరవానికి ప్రతిస్పందించారు. ఎక్స్ లో అభిమానులు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతను పంచుకున్నారు. పురస్కారం దక్కినందుకు వినయపూర్వక అభివందనాలు. ఈ గౌరవం నా ఒక్కడికే దక్కలేదు.. ఈ ప్రయాణంలో నాతో పాటు ప్రయాణించిన ప్రతి ఒక్కరికీ ఇది దక్కుతుంది. నా కుటుంబం, ప్రేక్షకులు, సహోద్యోగులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు, మీ ప్రేమ, నమ్మకం , ప్రోత్సాహం నాకు గొప్ప బలం. నన్ను ఇలా ఈ రోజు ఇవన్నీ రూపొందించాయి. ఈ గుర్తింపునకు హృదయపూర్వక ధన్యవాదాలు`` అని రాసారు.