కల్కి 2898 ఏడి నుంచి దీపిక పదుకొనేను తొలగిస్తున్నామని వైజయంతి మూవీస్ సంస్థ అధికారికంగా ప్రకటించిన రెండు రోజులకు దీపిక స్వయంగా స్పందించింది. ఎక్కడా వైజయంతి గురించి కానీ, అశ్వనిదత్ బృందం గురించి కానీ పేరు పెట్టకుండానే తనదైన శైలిలో సెటైరికల్ గా స్పందించింది.
దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే `ఓంశాంతి ఓం` సినిమాతో డెబ్యూ ఇచ్చినప్పుడు తాను ఎలా ఉండాలో ఫిక్సయ్యానని, షారూఖ్ నుంచి తాను దానిని నేర్చుకున్నానని దీపిక చెప్పుకొచ్చింది. ఒక సినిమా విజయం గురించి కాదు.. ఆ సినిమాకి పని చేసిన మనుషుల గురించి.. వ్యక్తిత్వాల గురించి మాత్రమే ఆలోచిస్తాను! అని పరోక్షంగా దీపిక పదుకొనే `కల్కి 2898 ఏడి` బృందంపై క్రిప్టిక్ గా స్పందించింది. నిజానికి దీపిక ప్రతిస్పందన కాస్త ఘాటుగానే ఉందని చెప్పాలి. తన స్పందన చూస్తుంటే, అసలు కల్కి 2898 ఏడి టీమ్ తో అసలు దీపిక సింక్ అవ్వలేదనే అర్థమవుతోంది. కల్కి పేరెత్తకుండానే పంచ్ లు గట్టిగానే విసిరింది. బహుశా సుదీర్ఘమైన టైమింగ్స్ దీపికకు నచ్చలేదు. ఇప్పుడు బిడ్డకు తల్లి అయింది కాబట్టి సీక్వెల్ కి పని చేయడం చాలా కష్టతరమైన సమస్య అని కూడా భావించాల్సి వస్తోంది. ఎనిమిది గంటలు దీపికను సెట్లో ఉంచగలిగితే ఇక ఎవరైనా మొనగాళ్లేనని భావించాల్సి ఉంటుంది. రాజీ అన్నదే లేకుండా తన వాదన వినిపిస్తున్న దీపిక తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అంటోందని నెటిజనులు సోషల్ మీడియాల్లో సెటైర్లు వేస్తున్నారు. దీపిక వివాదాస్పద వైఖరి గురించి, రూల్స్ గురించి మరోసారి చర్చ మొదలైంది.
కల్కి చిత్రీకరణ సమయంలో దీపికతో సుదీర్ఘ కాలం ప్రయాణించినా కానీ తనతో సింక్ కుదరలేదని, అందుకే ఇక కలిసి పని చేయలేమని వైజయంతి మూవీస్ స్పష్ఠంగా తన నోట్ లో వెల్లడించింది. దీనికి కౌంటర్ గా ఇప్పుడు దీపిక స్పందించిందన్నమాట.