ప్రతిష్ఠాత్మక అకాడెమీ పురస్కారాలకు వేదిక సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే భారతదేశం నుంచి ఆస్కార్స్ 2026 బరిలో పోటీపడేందుకు కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన `హోమ్ బౌండ్` అధికారికంగా అకాడెమీ పురస్కారాల్లో ఫీచర్ ఫిలిం కేటగిరీలో పోటీకి దిగుతోంది. ఈ సినిమాని ఇండియా నుంచి నామినేట్ చేస్తున్నట్టు ఫిలింఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమాకి నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించారు. 2026 ఆస్కార్స్ బరిలోకి నామినేట్ అయిన సందర్భంగా జాన్వీకపూర్, కరణ్ జోహార్ సహా నీరజ్ ఘయ్వాన్ తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఇది అందరికీ కనెక్టయ్యే కథాంశంతో రూపొందిందని కూడా టీమ్ తెలిపింది. దర్శకుడు నీరజ్ కి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెస్తుందని కూడా నిర్మాత కరణ్ జోహార్ అన్నారు.
ఇది అందరికీ కల లాంటిది అని జాన్వీ సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఇటీవలే టొరెంటో ఫిలింఫెస్టివల్ లో హోంబౌండ్ చిత్రాన్ని ప్రదర్శించగా, ఇంటర్నేషనల్ పీపుల్స్ ఛాయిస్ కేటగిరీలో రెండవ రన్నరప్‌గా నిలిచింది. మరో ఐదు రోజుల్లోనే ఈ సినిమా థియేటర్లలోకి వస్తుండగా, ఇప్పుడు ఆస్కార్స్ 2026 కి ఎంపికవ్వడం కలెక్షన్స్ కి బిగ్ బూస్ట్ నిస్తుందని భావిస్తున్నారు.