ఓవర్ నైట్‌లో ఉన్ని ముకందన్ ఫేట్ మార్చేసిన సినిమా - మార్కో. ఈ మలయాళ యాక్షన్ చిత్రం అతడికి పాన్ ఇండియాలో మార్కెట్ ని పెంచింది. ఆ తర్వాత నిర్మాతలు సీక్వెల్ పై మరింత శ్రద్ధగా పని చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ సీక్వెల్ కి టైటిల్ ఫిక్సయిందని సమాచారం. `లార్డ్ మార్కో` అనే టైటిల్ ను మలయాళ ఫిల్మ్ ఛాంబర్ లో మేకర్స్ అధికారికంగా రిజిస్టర్ చేశారు.
అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. `మార్కో` సీక్వెల్ లో ఒరిజినల్ బ్లాక్ బస్టర్ లో నటించిన ఉన్ని ముకుందన్ నటించడం లేదని తెలుస్తోంది. ఇటీవల అతడు తిరిగి సీక్వెల్ తో వస్తున్నాడని వార్తలు వెలువడ్డాయి. కానీ లార్డ్ మార్కో టైటిల్ ప్రకటన పత్రంలో అతడి పేరు లేకపోవడంతో అభిమానులలో సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు లీడ్ పాత్రకు ఎవరిని తీసుకుంటారనే దానిపై ఊహాగానాలు చెలరేగాయి.
ట్రేడ్ విశ్లేషకుడు ఎబి జార్జ్ ప్రకారం... ``దర్శకుడు హనీఫ్ అదేని- నిర్మాత షరీఫ్ ముహమ్మద్ లార్డ్ మార్కో అనే టైటిల్‌ను ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేసారు.. ఉన్నిముకుందన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాదు. మార్కో2లో ఎవరు హీరోగా ఎవరు నటిస్తారని మీరు అనుకుంటున్నారు? `` అని టీజ్ చేయడం అభిమానుల్లో ఊహాగానాలకు దారితీసింది. మమ్ముట్టి, యష్, పృథ్వీరాజ్, హృతిక్ రోషన్ వంటి పేర్లను ఫ్యాన్స్ సూచించారు.
అయితే ఉన్ని ముకుందన్ గతంలో తాను మార్కో సీక్వెల్ లో నటించబోనని ప్రకటించిన సంగతిని కొందరు అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ పై చాలా ప్రతికూలత ఉంది. అందుకే విరమించుకున్నానని, అంతకుమించి మెరుగైన పెద్ద ప్రాజెక్టుతో మీ ముందుకు వస్తానని ఉన్ని ముకుందన్ ప్రకటించారు.
మార్కో ఇప్పటివరకు అత్యంత హింసాత్మకమైన మలయాళ చిత్రంగా రికార్డులకెక్కింది. ఏ రేటెడ్ మూవీలో నటించడంపై ఉన్ని ముకుందన్ విమర్శలకు గురయ్యాడు. తీవ్రమైన హింస, రక్తపాతం గగుర్పాటుకు గురి చేయడంతో అది నిరాశగా మారింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్కును అందుకుంది. ప్రస్తుతానికి సీక్వెల్ టైటిల్ లార్డ్ మార్కో రిజిస్టరైంది. నిర్మాతలు కాస్టింగ్ వివరాలను వెల్లడించాల్సి ఉంది.