బిజినెస్ మేన్ కం నటుడు రాజ్ కుంద్రా 60కోట్ల మోసం కేసులో విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన ఉద్ధేశపూర్వకంగా డబ్బును దుర్వినియోగం చేసాడు లేదా దారి మళ్లించాడనేది ప్రధాన అభియోగం. కుంద్రాపై ఆర్థిక నేరాల విభాగం జరిపిన దర్యాప్తులో బాలీవుడ్ ప్రముఖులతో ఆర్థిక సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 60 కోట్ల మోసం కేసులో వివాదాస్పద నిధులలో కొంత భాగాన్ని బాలీవుడ్ నటీమణులు బిపాషా బసు, నేహా ధూపియాలకు పారితోషికాలుగా చెల్లించినట్లు వ్యాపారవేత్త రాజ్ కుంద్రా దర్యాప్తుదారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఇవోడబ్ల్యూ) ఇటీవల ఐదు గంటల పాటు ఆయనను ప్రశ్నించినప్పుడు ఈ విషయాలన్నీ బయటపడినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కుంద్రా ప్రారంభించిన బెస్ట్ డీల్ టీవీ తో ముడిపడిన లావాదేవీలను పరిశీలించినప్పుడు అధికారులకు చాలా సందేహాలు కలిగాయి. దాదాపు రూ.25 కోట్ల ప్రత్యక్ష బదిలీలను ట్రాక్ చేయగా, పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లతో పాటు పాపులర్ టీవీ చానెల్ బాలాజీ ఎంటర్‌టైన్‌మెంట్ తో కుంద్రా డబ్బు బదిలీకి ఉన్న సంబంధం అనుమానాలు రేకెత్తించినట్టు కథనాలొచ్చాయి.
కంపెనీ ఖాతాల నుంచి శిల్పా శెట్టి, బిపాసా బసు, నేహా ధూపియా సహా మొత్తం నలుగురు నటీమణులకు చేరిందని నేర విభాగాల దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. 2016 నోట్ల రద్దు కాలంలో జరిగిన మనీ ట్రాన్స్ ఫర్స్ గురించి కూడా అధికారులు ప్రశ్నించారు. కంపెనీ అప్పటికే ఆర్థిక సంక్షోభంలోకి చేరుకుంది. ప్రస్తుతం మనీ ట్రాన్స్ ఫర్లకు సంబంధించిన ఆధారాలను అధికారులు సంపాదించారు. అయితే ఈ చెల్లింపులు దేనికోసం అనేది ఇంకా పరిశీలనలో ఉంది. బెస్ట్ డీల్ టీవీ కోసం తయారు చేసిన వీడియోలను తిరిగి పరిశీలించనున్నామని కూడా అధికారులు వెల్లడించారు.
ప్రముఖ వ్యాపారి దీపిక్ కొఠారీ ఫిర్యాదు కారణంగా కుంద్రా మోసం బయటపడింది. 2015-2023 మధ్య బెస్ట్ డీల్ టీవీకి పెట్టుబడులు రాగా, పెట్టుబడిదారుల నిధులను దుర్వినియోగం చేశారని కొఠారి ఆరోపించారు. అనంతరం కుంద్రా - శిల్పా శెట్టి ఇద్దరూ విచారణలో ఉన్నారు. వారి అంతర్జాతీయ ప్రయాణాన్ని పరిమితం చేయడానికి లుక్ అవుట్ సర్క్యులర్లు జారీ చేయడం చర్చగా మారింది. డబ్బు బదిలీలను మరింతగా పరిశీలిస్తే మరింతమంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చేందుకు అవకాశం ఉందని సమాచారం.