ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఇటీవల నటుడిగా మారిన సినీనిర్మాత రాజ్ కుంద్రా దాదాపు 60 కోట్ల మోసానికి సంబంధించిన కేసులో తీవ్ర విచారణను ఎదుర్కొంటున్నారు. తాజా విచారణలో అతడు ఐదు కంపెనీలలో తాను పెట్టుబడులు పెట్టానని ముంబై ప్రత్యేక నేరవిభాగాల శాఖ పోలీస్ అధికారుల ఎదుట అంగీకరించినట్టు బాలీవుడ్ బబుల్ తన కథనంలో వెల్లడించింది. ఐదు కంపెనీల్లోకి 60 కోట్లు పంపిణీ చేసినా కానీ దానిని దుర్వినియోగం చేసాడని, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించాడని, లేదా ఇతరులకు దొడ్డి దారిలో పంపించి ఉంటాడని అతడిని అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఐదు గంటల పాటు సాగించిన విచారణలో అతడు చాలా విషయాలను చెప్పాడు. రాజ్ కుంద్రా తదుపరి విచారణకు మరో వారంలో హాజరు కావాల్సి ఉంటుందని కూడా తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ కేసులో టీవీ చానెల్ ప్రసారాల కోసం 20 కోట్లు, ఆఫీస్ నిర్వహణ, అద్దె ఇతర అవసరాల కోసం 25 కోట్లు, గోదాం నిర్వహణకు 3.15 కోట్లు ఖర్చు చేసినట్టు రాజ్ కుంద్రా లెక్కలు చెప్పడం కూడా పలు సందేహాలకు తావిస్తోంది. అలాగే 4కోట్లు సెలబ్రిటీ ఫీజుగా అతడు తన కంపెనీ నుంచి బదలాయించడాన్ని నేరవిభాగ అధికారులు సందేహిస్తున్నట్టు మీడియా తన కథనంలో వెల్లడించింది.
ఇక ఈ కేసులో అతడు ప్రముఖ టీవీ చానెల్ అధినేత్రి ఏక్తాకపూర్, ఆమెకు చెందిన బాలాజీ టెలీఫిలింస్ తో లావాదేవీలు కొనసాగించడంపైనా ఆరాలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో రాజ్ కుంద్రా భార్య, ప్రముఖ నటి శిల్పాశెట్టిని కూడా తదుపరి విచారించనున్నారని, త్వరలో సమన్లు పంపుతారని బాలీవుడ్ బబుల్ కథనం ప్రచురించింది.