బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటిపై కాల్పులు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. శనివారం తెల్లవారుఝామున ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపారని పోలీసులు నిర్ధారించారు. సీసీ ఫుటేజ్ లో ఆ ఇద్దరూ రికార్డయ్యారు. వారి చేతిలో పిస్టోల్ ఉంది. పది రౌండ్లు పైగా కాల్పులు జరిపారని విచారణలో తేలింది.
ఇదిలా ఉంటే దిశా పటానీ ఇంటిపై దుండగులు కాల్పులు జరపడానికి అసలు కారణం ఏమిటో ప్రజలకు అర్థం కాలేదు. దీనికి కారణం దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ మతపరమైన వ్యాఖ్యలు చేయడమేనని తెలుస్తోంది. ప్రేమానంద్ మహారాజ్ - అనిరుధ్ ఆచార్య మహారాజ్ ల భోధనలను కించపరుస్తూ ఖుష్బూ పటానీ కామెంట్ చేసారు.
పాతిక వయసు దాటిన యువతి వ్యభిచారానికి పాల్పడుతుందని అర్థం వచ్చేలా అనిరుధ్ ఆచార్య చేసిన కామెంట్లను ఖుష్బూ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే నెటిజనులు ఖుష్బూ ను తీవ్రంగా వ్యతిరేకించి ట్రోల్ చేసారు. ఇప్పుడు నేరుగా దిశా- ఖుష్బూ ఉంటున్న ఇంటిపై గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ కి చెందిన ముఠా సభ్యులు కాల్పులు జరపడం సంచలనమైంది. గ్యాంగ్ స్టర్ తన నోట్ లో మతపరమైన కామెంట్లు చేసేవారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ముఖ్యంగా మహారాజ్ లను కించపరుస్తూ అగౌరవంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇది ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించారు.
అయితే తన కుమార్తె వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేసారని ఖుష్బూ పటానీ తండ్రి జగదీష్ పటానీ మీడియాకు వెల్లడించారు. సందర్భాన్ని మార్చేసి మహారాజ్ ని కించపరిచినట్టు అర్థం వచ్చేలా ఆ వ్యాఖ్యలను ప్రమోట్ చేసారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తన కుమార్తె తప్పిదం ఏమీ లేదని అన్నారు.
ఖుష్బూ వ్యాఖ్యలను ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్‌తో తప్పుగా అనుసంధానించారని జగదీష్ అన్నారు. ఈ గందరగోళంలోకి లాగారు. మేం సనాతనాన్ని అనుసరిస్తాం. స్వామీజీలు సాధువులను గౌరవిస్తాం. నా కుమార్తె ప్రకటనను తప్పుగా మార్చి చూపించడం కుట్ర అని అన్నారు.