ప్రముఖ హాస్యనటుడు, బుల్లితెర హోస్ట్ ని దెయ్యం ఝడిపించింది. ముంబై నగరాన్ని బాంబే అని కానీ, బొంబై అని కానీ పిలవకూడదని హెచ్చరించింది. ముంబై అని మాత్రమే పిలవాలి. లేదంటే మేం ఉద్యమం చేపట్టడానికి కూడా వెనకాడబోము.. తస్మాత్ జాగ్రత్త! అని సదరు ఘోస్ట్ వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది.
అసలింతకీ ఎవరు ఈ ఘోస్ట్ అంటే... ఎం.ఎన్.ఎస్ ఫిలిం వింగ్ నాయకుడు అమేయ ఖోప్కర్. పూర్తి వివరాల్లోకి వెళ్లాలి. పాపులర్ కమెడియన్ కపిల్ శర్మ `ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో` పేరుతో ఒక షోని హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి హాజరైన చాలా మంది అతిథులు బాంబే అని బొంబై అని తమ నగరాన్ని పిలుస్తున్నారని, ఇది ప్రజల్ని అవమానించడమేనని ఎంఎన్ ఎస్ భావిస్తోంది. అందువల్ల హోస్ట్ కపిల్ శర్మ ముందే షో అతిథులను హెచ్చరించాలి. బాంబే అని కానీ, బొంబై అని కానీ మా నగరాన్ని పిలవకూడదని చెప్పాలి. కేవలం ముంబై అని మాత్రమే ఈ నగరాన్ని పిలవాలని కూడా వారికి చెప్పాలని ఖోప్కర్ హెచ్చరించారు.
కొన్నేళ్లుగా తాము ఈ షోని చూస్తున్నామని ఇకపై పరిస్థితి మారాలని కూడా కోరారు. చెప్పింది వినకపోతే మా నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటారని కూడా వార్నింగ్ ఇచ్చారు ఖోప్కర్. స్థానిక ఎన్నికల వేళ ఎంఎన్ఎస్ నాయకుడు ఇలా మీడియా ఎదుట పబ్లిసిటీ కోసం హెచ్చరికలు జారీ చేసారని చాలా మంది భావించారు. కానీ ఎన్నికలతో సంబంధం లేకుండా తాము దీనిని ఉద్యమంలా చేపడుతున్నామని కూడా ఆయన వివరణ ఇచ్చారు. సినిమా వాళ్లు లేదా టీవీ ప్రముఖులపై రాజకీయ నాయకుల జులుం గురించి ఇప్పుడు సోషల్ మీడియాల్లో విమర్శలు ఎదురవుతున్నాయి.