ఇటీవలి కాలంలో కొత్త తరం నటుల కెరీర్ ప్రారంభంలోనే `ఉత్తమ నటుడు, నేషనల్ క్రష్` అంటూ ట్యాగ్ లు ఇస్తూ సీనియర్ నటులను శిక్షణ పొందిన నటులను అవమానిస్తున్నారని తన ఆవేదన వ్యక్తం చేసారు మనోజ్ భాజ్ పాయ్. అంతగా అనుభవం లేని నటులు పీఆర్వోలకు డబ్బు చెల్లించి ఇమేజ్ ని కృత్రిమంగా క్రియేట్ చేయాలనుకుంటున్నారని కూడా అన్నారు. నేను గొప్పగా నటించానని అనుకున్న సినిమాలో మరో నటుడిని ఉత్తమ నటుడు అని ప్రచారం చేయడం చూసాను. ఇది నిజంగా సీనియర్ నటులకు శిక్షణ పొందిన వారికి అవమానం అని అన్నారు.
పీయూష్ లాంటి నటుడిని ఉదహరిస్తూ.. కొత్త నటులను హైలైట్ చేస్తూ, నట శిక్షణ పొందిన ఇలాంటి నటుడిని, నా లాంటి సీనియర్ నటుడిని కూడా అవమానిస్తున్నారని అన్నారు. పీఆర్వోలు క్రియేట్ చేసే కృత్రిమ ఇమేజ్ నిలబడదని అన్నారు. అయితే మనోజ్ భాజ్ పాయ్ నేషనల్ క్రష్ అనే పదాన్ని ఉపయోగించి ఫైర్ అవ్వడంతో అతడు రష్మిక మందన్నను టార్గెట్ చేసాడని అంతా భావిస్తున్నారు.
కానీ మనోజ్ భాజ్ పాయ్ ఉద్ధేశం వేరు. పీఆర్వోలు క్రియేట్ చేసే పబ్లిసిటీ స్టంట్ ఇండస్ట్రీని నాశనం చేస్తుందని మనోజ్ అభిప్రాయపడుతున్నట్టు నెటిజనులు విశ్లేషిస్తున్నారు. భాజ్ పాయ్ తదుపరి జుగ్నుమా అనే ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఆర్జీవీ సత్య చిత్రంలో నటనకు గాను మనోజ్ భాజ్ పాయ్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే.