తానొకటి తలిస్తే దైవమొకటి తలచిన చందంగా.. క్వీన్ కంగన రనౌత్ ఆశించినది జరగడం లేదు. ఎంత ప్రయత్నించినా హిట్టు కొట్టలేకపోతోంది. పరిశ్రమలో పరాజయాలతో పాటు అవమానాలు ఎదురవుతున్నాయి. నటిగా, దర్శకురాలిగా ఎంత శ్రమించినా సరైన విజయం దక్కడం లేదు. ఇటీవల కొన్ని వరుస డిజాస్టర్లు ఊపిరాడనివ్వలేదు. అయినా సక్సెస్ కోసం క్వీన్ ఇంకా ఆశగా ఎదురు చూస్తూనే ఉంది.
ఇలాంటి సమయంలో కెరీర్ కి కీలకమైన ప్రాజెక్ట్ దర్శకనిర్మాతల వివాదం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. ఇది తను వెడ్స్ మను ఫ్రాంఛైజీ చిత్రం- తను వెడ్స్ మను 3. ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేసేందుకు కంగన సిద్ధమవుతోంది. కానీ ఇంతలోనే దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తో విభేధిస్తూ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ లీగల్ నోటీసులు పంపడంతో అది డైలమాలో పడింది. ఈ సినిమా టైటిల్ తో కానీ కథతో కానీ ఎవరూ సినిమాలు తీయలేరు.. అన్ని హక్కులు తమకు మాత్రమే చెందుతాయని ఈరోస్ సంస్థ ప్రకటించింది.
అయితే ఈరోస్ తో సంబంధం లేకుండా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఇప్పుడు ఫ్రాంఛైజీలో మూడో భాగాన్ని కంగన ప్రధాన పాత్రలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో ఆర్.మాధవన్ కూడా నటిస్తున్నారు. కానీ ఇంతలోనే ఈరోస్ నోటీసుల కారణంగా కంగన, ఆనంద్ ఎల్ రాయ్ లకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అయితే కోర్టు వివాదం పరిష్కరించుకుంటేనే ఈ ప్రతిష్ఠాత్మక సీక్వెల్ సినిమా చిత్రీకరణ ముందుకు సాగుతుంది. ప్రస్తుతానికి డైలమా కొనసాగుతోంది.