సంఘంలో చాలామంది మేధావులు ఉన్నారు. కాపీ రైట్స్ హక్కుల గురించి వీళ్లందరికీ బాగా తెలుసు. అయితే దానిని సద్వినియోగం చేయడమెలానో మ్యాస్ట్రో ఇళయరాజా నిరూపిస్తున్నారు. ఆయన తన క్లాసిక్ డే పాటల నుంచి కాపీ ట్యూన్లు ఉపయోగించేవారికి చట్టబద్ధంగా ఇవ్వాల్సిన పద్ధతిలో కౌంటర్ ఇస్తున్నారు. కాపీ ట్యూన్లు కాదు.. క్రియేటివిటీ అలవరుచుకోమని చట్టబద్ధంగా హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే తన పాటల్ని కాపీ కొట్టిన చాలా మందికి లీగల్ నోటీసులు పంపిన ఇళయరాజా కోర్టుల పరిధిలో తన పంతం నెగ్గించుకుంటున్నారు. కాపీ క్యాట్‌లకు బుద్ధి చెబుతున్నారు. ఇప్పుడు తళా అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీలో తన పాటలను కాపీ చేసారంటూ ఆయన కేసు దాఖలు చేయగా దానిపై చెన్నై హైకోర్టులో విచారణ సాగుతోంది. తనకు చెందిన మూడు పాటలతో పాటు సినిమాను ప్రదర్శించడం, అమ్మడం, పంపిణీ చేయడం, ప్రచురించడం, ప్రసారం చేయడం వంటి వాటిని నిరోధించాలని కోరుతూ రాజా దాఖలు చేసిన పిటిషన్ ని విచారించిన న్యాయమూర్తి ఎన్ సెంథిల్‌కుమార్ తుది తీర్పు చెప్పారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాని తాత్కాలిక నిషేధించాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఇది ఇప్పుడు నిర్మాతలకు ఊహించని షాక్ గా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఆన్ లైన్ లో ఉన్న ఈ సినిమాని వెంటనే తొలగించాల్సి ఉంటుంది.
నట్టుపుర పట్టు చిత్రంలోని `ఓథ రుబాయుమ్ థారెన్`, `సకలకళా వల్లవన్` చిత్రంలోని `ఇలమై ఇధో ఇదో`, విక్రమ్ చిత్రంలోని `ఎన్ జోడి మాంజా కురువి` ఇవన్నీ తన సొంత సృజన నుంచి వచ్చిన బాణీలు.. కానీ వాటిని గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం కాపీ చేసారని ఇళయరాజా కోర్టులో పోరాడారు. ఈ పోరాటంలో ఆయనదే పై చేయి అయింది. తన అనుమతి లేకుండా పాటల్ని కాపీ కొట్టారని, తనకు రాయల్టీ చెల్లించలేదని ఇళయరాజా కోర్టులో వాదించారు. కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 19(9) - సెక్షన్ 19(10) ఆధారంగా ఇది తన కాపీరైట్ -నైతిక హక్కులను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కోర్టులో సానుకూల తీర్పు వెలువడింది.