నిజమే గత ఆరేళ్లుగా ఏపీ ముఖ చిత్రాన్ని ఏ నాయకులూ మార్చలేకపోతున్నారు. జగన్ ప్రభుత్వంలో రోడ్ల ను నిర్ధాక్షిణ్యంగా వదిలేసి ప్రజల నడుములు విరగ్గొట్టిన విషయం ఏపీలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి అనుభవమే. జగన్ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి దీనావస్థకి వెళ్లిపోయాయి. ఎక్కడ చూసినా గోతులు, వర్షాకాలంలో ఆ గోతుల్లో నీళ్లు. రోడ్ల గోతుల విషయంలో ప్రతిపక్షాలు వెలుగెత్తి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో రోడ్ల నిర్మాణం చేపడతాం, సంక్రాంతి కల్లా మెరిసే రోడ్ల పై ఏపీ ప్రజలు ప్రయాణిస్తారని ఊదరగొట్టారు. అదే ఊపులో కొన్ని రోడ్లను బాగు చేసారు. కానీ చాలా రోడ్లను అలానే వదిలేసారు. సోషల్ మీడియాలో ఆ రోడ్లపై ప్రయాణం చేస్తూ నడుములు ఇరుగుతున్న, యాక్సిడెంట్లు అవుతున్న వీడియో లు చక్కర్లు కొడుతున్నాయి. సదరు ఎమ్యెల్యేలను కలిసి పల్లె ప్రజలు అర్జీలు పెట్టుకుంటున్నారు.
అదిగో ఇదిగో అనడమే కానీ ఆ రోడ్లు బాగుగుపడిన సందర్భం లేదు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మాటిచ్చాడు, రోడ్లు బాగుపడతాయని చాలామంది బ్రమ పడ్డారు కానీ అది కేవలం ఊర్ల వరకే సరిపెట్టారు. మధ్యలో వదిలేసారు. ఏపీలో చాలా చోట్ల రోడ్ల పై ప్రయాణం చెయ్యడానికి ప్రజలు భయపడుతున్నారు. ఆటో లో వెళ్లినా, బండి వేసుకుని వెళ్లినా నడుం విరగడం ఖాయం. బండి షెడ్డుకు పోవడం ఖాయం.
మరి ఎవరొచ్చినా, ఎంతమంది నాయకులు మారినా ఈ రోడ్ల విషయంలో ఏపీ ముఖ చిత్రాన్ని మాత్రం మార్చలేకపోతున్నారు.